తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ యువ నాయకుల ఆగ్రహం
లోక్‌సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్–పాకిస్థాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట యువ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అమరవీరుల త్యాగాలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించడం అనర్హమని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన బిల్లులను అదే వేదికపై తక్కువ చేసి మాట్లాడడం దురదృష్టకరమని, తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టానికి బీజేపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు విభిన్నంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధిలో ముందంజలో ఉందని పేర్కొన్నారు.భారత్‌లోని రాష్ట్రాలను పాకిస్థాన్‌తో పోల్చడం దేశభక్తికి విరుద్ధమని, ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కోర్టుకు వెళ్లిన వారికి ఇచ్చినట్లే ప్రతి అంశంలో సమాన న్యాయం చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మ రజినీకాంత్ రెడ్డి, సర్పంచ్ నరేందర్ రెడ్డి, యువ నాయకులు బోగారి చరణ్, సామలసాయి ప్రేమ్, బైరి వెంకట్, సతీష్, సాయి గౌడ్, నాగరాజు, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
