రేషన్ 'పరేషాన్'.. సిటీలో లబ్ధిదారుల అవస్థలు!

  • మూడు నెలల కోటా ఒక్కసారిగా పంపిణీ.. ఆటో ఛార్జీల మోత
  • గోధుమల మాయాజాలం.. కిలోకు రూ. 16 వసూలు చేస్తున్న డీలర్లు

రేషన్ 'పరేషాన్'.. సిటీలో లబ్ధిదారుల అవస్థలు!

*హైదరాబాద్ : 

బంగారు తెలంగాణలో రేషన్ కష్టాలు.. పట్టణ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకేసారి భారీ మొత్తంలో సరుకులు వస్తుండటంతో వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి కూలీలు, ఆటో ఛార్జీల రూపంలో రూ. 200 నుంచి రూ. 300 వరకు అదనపు భారం పడుతోందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పని మానుకుని గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నా.. చివరకు డీలర్ల చేతివాటంతో సరుకులు తక్కువగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.WhatsApp Image 2026-04-15 at 16.07.04

గోధుమల పంపిణీలో ‘డీలర్ల’ దందా

రేషన్ షాపుల్లో గోధుమల పంపిణీ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కార్డులకు సరిపడా గోధుమలు రావడం లేదని సాకు చూపుతూ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్టాక్ ఉన్నా లేదని బుకాయిస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి కిలో గోధుమలు రూ. 7కే అందించాల్సి ఉండగా, కొన్నిచోట్ల డీలర్లు ఏకంగా రూ. 16 వసూలు చేస్తూ లబ్ధిదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. అడిగితే "మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి" అంటూ దురుసుగా సమాధానం చెబుతుండటం గమనార్హం.

తూకంలో మాయ.. బోర్డులు మాయం!

నియమ నిబంధనల ప్రకారం ప్రతి రేషన్ షాపు ముందు స్టాక్ వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలి. కానీ, నగరంలోని మెజారిటీ షాపుల్లో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. తూకాల్లోనూ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మూడు నెలల సరుకు కలిపి తీసుకునేటప్పుడు సుమారు 2 నుంచి 3 కిలోల వరకు తక్కువ వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ డీలర్లతో కుమ్మక్కయ్యారని, అందుకే తనిఖీలు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎండలో ‘వడ’దెబ్బ.. కనీస సౌకర్యాలు శూన్యం

మండిపోతున్న ఎండల్లో వృద్ధులు, మహిళలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో లబ్ధిదారులు అస్వస్థతకు గురవుతున్నారు.

> "కూలి పని వదులుకుని వస్తే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆటో కిరాయిలకే సగం డబ్బులు పోతున్నాయి. అధికారులు స్పందించి ధరల పట్టికలు ఏర్పాటు చేయించాలి. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలి."
> *—కొండల్ .వేముల*

ఇకనైనా పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంపిణీ తీరును పర్యవేక్షించాలని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.WhatsApp Image 2026-04-15 at 15.54.10

About The Author