6 గ్యారంటీల అమలుకు రూ.1000 కోట్లకు పైగా వ్యయం : కలెక్టర్ కే. హైమావతి

6 గ్యారంటీల అమలుకు రూ.1000 కోట్లకు పైగా వ్యయం :  కలెక్టర్ కే. హైమావతి

సిద్దిపేట:

రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల మరియు రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలుకు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా మండల స్థాయి సభలు నిర్వహించగా, కొమురవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు 99 రోజులపాటు ఈ కార్యాచరణ కొనసాగుతున్నదని తెలిపారు. గ్రామ స్థాయిలో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించగా, మండల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని, మే నెలలో నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి వారం ఒక శాఖకు సంబంధించిన థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, హెల్త్ వీక్, అరైవ్-అలైవ్ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.రైతులు పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. జిల్లాలో 25 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, ప్రతి నెల 6580 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా, గ్యాస్ సబ్సిడీ, గృహజ్యోతి, రైతు భరోసా వంటి పథకాల ద్వారా కోట్లాది రూపాయలు లబ్ధిదారులకు అందుతున్నాయని తెలిపారు.
అలాగే మహిళల ఉచిత బస్సు ప్రయాణం, విద్యా రంగ అభివృద్ధి కోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవ బీమా పథకం అమలు చేస్తామని, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విస్తరణతో పాటు అల్పాహారం పథకం కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ రహదారి భద్రతపై, మహిళా శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారంపై ప్రతిజ్ఞ చేయించగా, అనంతరం ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు.
 కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About The Author