మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సమాన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
- - కోర్టుకు వెళ్లని ఒంటరి బాధితులు ఇంకా నిరీక్షణలో
- - ముంపుతో జీవనాధారాలు కోల్పోయామని ప్రజల ఆవేదన
- - ఆర్అండ్ఆర్ కాలనీ కౌన్సిలర్లు కలెక్టర్, ఆర్డిఓకు వినతిపత్రం అందజేత
సిద్దిపేట:
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపుతో అన్నీ కోల్పోయామని, ఇప్పుడు న్యాయం కూడా కోల్పోవాలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పరిస్థితుల్లో ఉన్న బాధితులకు వేర్వేరు విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో అనేక గ్రామాలు పూర్తిగా లేదా పాక్షికంగా ముంపుకు గురై, వందలాది కుటుంబాలు తమ భూములు, ఇళ్లు, జీవనాధారాలను కోల్పోయాయి. ప్రస్తుతం పునరావాస కాలనీల్లో నివసిస్తున్న బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, పురుషులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. న్యాయం కోసం కొంతమంది బాధితులు కోర్టును ఆశ్రయించగా, వారికి ఇటీవల రూ.12.54 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు అయింది. అయితే కోర్టుకు వెళ్లని ఇతర ఒంటరి బాధితులు ఇప్పటికీ అదే సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో కోర్టుకు వెళ్లలేదని, ఇప్పుడు అదే కారణంగా తమకు నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం ఆర్అండ్ఆర్ కాలనీ కౌన్సిలర్లు మన్యం విష్ణువర్ధన్ రెడ్డి, గుగ్లోత్ రమేశ్, శేరుపల్లి ఉపేందర్ రెడ్డి, కోట బాబు, కొలిచిలిమా భవాని, నర్సింహారెడ్డి సమక్షంలో బాధితులు తమ సమస్యలను వివరించి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, ఆర్డిఓ సదానందంకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ఒకే పరిస్థితుల్లో ఉన్న ఒంటరి మహిళలు, పురుషులకు వేర్వేరు విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లిన వారికి ఇచ్చినట్లే, కోర్టుకు వెళ్లని బాధితులకు కూడా అదే స్థాయిలో రూ.12.54 లక్షల ఆర్థిక సహాయం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు నిర్మించడం మాత్రమే కాకుండా, ముంపుతో అన్నీ కోల్పోయిన ప్రజలకు జీవనోపాధి, భద్రత, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి బాధితునికి సమాన న్యాయం చేయడమేనని బాధితులు స్పష్టం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
