జిల్లాలో అభివృద్ధి పనులు వివిధ శాఖల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొనిరావాలి..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా, రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించి ప్రజలను,నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే కావాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్బంగా బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశానికి 1947 లో స్వతంత్రం వచ్చినప్పటికి తెలంగాణ నిజాం పాలనలో ఉందని తదుపరి అన్యాయాలను ఎదిరించేందుకు పోరాటాల ద్వారా, సాహిత్యం ద్వారా ప్రజలకి వారి హక్కులు తెలిసేలా చేశారని,మన ప్రాంతానికి చెందిన వారికే ఉద్యోగాలు వస్తే ప్రాంతంతో పాటు, దేశం అభివృద్ధి చెందుతుందని భావించి ఉద్యోగాల కోసం ప్రజల తరుపున ఎంతగానోపోరాడారని, వారిని స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఉద్యోగి బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేయాలని జిల్లాలో అభివృద్ధి పనులు,విద్య, వైద్యం,వ్యవసాయం, సంక్షేమ శాఖల ద్వారాప్రజలలో చైతన్యం తీసుకొనిరావాలని అన్నారు. ఉద్యోగులు అర్హత ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టి భాద్యతగా భావించి కృషి చేయాలని, వెనుకబడిన వారిని అభివృద్ధి చేసి సమాజంలో స్థిర మార్పు తీసుకొచ్చేందుకు ఉద్యోగులందరూ ఒక బృందంగా ఏర్పడి సూర్యాపేట జిల్లాని రాష్ట్రంతో పాటు, దేశంలోనే ముందంజలో ఉంచాలని అన్నారు. ఈ సాంకేతిక యుగంలో ఉద్యోగులు నైపుణ్యాలను అప్డేట్ చేసుకొని ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ పి. రాంబాబు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ అత్యంత పురాతనమైన బెనారస్ యూనివర్సిటీలో చదువుకొని కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా పని చేశారని అన్నారు.1952 , 1969 అలాగే మలి తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన నీళ్లు, నిధులు, నియమకాల కోసం ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వారి కృషిని తెలంగాణ ప్రజలు మరవద్దని ఆ మహనీయుని జయంతి సందర్భంగా స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి వి.వి. అప్పారావు, డిటిడిఓ శంకర్,పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటిండెంట్లు సాయి గౌడ్, సంతోష్ కిరణ్,శ్రీలత రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.