శాస్త్రవేత్తల స్థాయికి విద్యార్థులు ఎదగాలి : ప్రొఫెసర్ ఎం. ప్రసాద్
హైదరాబాద్
వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పెంచుతాయని ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం హెచ్ ఓడీ డాక్టర్ మీసాల. ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా జాగృతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డి. జోసఫిన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో ‘న్యూరోనోవా సైన్స్ ఫెస్ట్' ను నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా రూపొందించి ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆయన సందర్శించారు. అనంతరం ప్రొఫెసర్ ప్రసాద్ మాట్లాడుతూ, పరిశోధనలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులు పరిశోధనా రంగంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. యువత తమ బాధ్యతలను గుర్తించి సరైన మార్గంలో పయనించాలని కోరారు. కొత్త పరిశోధనలు చేస్తూ విద్యార్థులు శాస్త్రవేత్తల స్థాయికి ఎదగాలని అన్నారు. మానవ వికాసానికి కొత్త కొత్త ఆవిష్కరణలు జరపవలసి ఉంటుందని అన్నారు. విద్యార్థి దశలో పరిశోధన తత్వాన్ని విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చేకూరుతుందని ఆయన అన్నారు.ప్రతి విద్యార్థి విజ్ఞాన ప్రదర్శన పోటీలో పాల్గొని తన విజ్ఞతను ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ర్యాంప్ వాక్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జాగృతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ డి.జోసఫిన్ రెడ్డి, కార్యదర్శి ఎ. శశికిరణ్ రెడ్డి, ఎన్. నీతారెడ్డి, సంతోష్ రెడ్డి, మధుసూధన్, ఓఏ శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థిణిలు, తదితరులు పాల్గొన్నారు.
