ప్రజల సమస్యలు పరిష్కరించండి: అధికారులకు మాజీ కార్పొరేటర్ల వినతి
హయత్ నగర్:
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర మాజీ కార్పొరేటర్లు సోమవారం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంతో పాటు హయత్ నగర్ డివిజన్ లోని ప్రధాన సమస్యలపై అధికారులతో చర్చించారు.
వినతి పత్రంలోని ప్రధానాంశాలు:
దెబ్బతిన్న రహదారులు: హయత్ నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్లే మార్గంలో జైశ్వాల్ ఫర్నిచర్ వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. విజయవాడ - నాగార్జునసాగర్ జాతీయ రహదారులను కలిపే ఈ ప్రధాన మార్గంలో గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే బీటీ రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.
పారిశుధ్యం: కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి, పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి (ఆర్.కె.పురం), కొప్పుల నరసింహారెడ్డి (మన్సూరాబాద్), పవన్ (కొత్తపేట), రంగ నరసింహ గుప్తా (చైతన్యపురి), ప్రేమ మహేశ్వర్ రెడ్డి (గడ్డిఅన్నారం), చింతల అరుణా సురేందర్ యాదవ్ (నాగోల్) తదితరులు పాల్గొన్నారు.
