అధిక వర్షాలతో పంటల నష్టం నివారించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా :
ముఖ్యంగా ఉద్యాన పంటలు, కూరగాయలు, పూల పంటలు, మామిడి, అరటి, పనస, చింత, మిరప, టమోటా వంటి పంటల రైతులు ఈ క్రింది సూచనలను పాటించాలన్నారు.
1. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాలువలు ఏర్పరచి నీరు వెలుపలికి వెళ్లేలా చూడాలి.
2. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లో తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి.
3. వర్షం తగ్గిన తర్వాత తడి నేలపై యంత్రసామగ్రిని ఉపయోగించడం నివారించాలి.
4. ఆకులు తడిగా ఉన్నప్పుడు ఎరువులు లేదా పురుగుమందులు పిచికారీ చేయరాదు.
పంటల వారీ సూచనలు:
అరటి పంట: మొక్కలు వాలిపోకుండా మద్దతులు (స్టాకింగ్) ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
మామిడి పంట: వర్షం ఆగిన వెంటనే పండ్ల కుళ్లును నివారించేందుకు కాపర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా/లీ) పిచికారీ చేయాలి.
టమోటా, మిరప, వంకాయ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఫంగల్ వ్యాధులు కనిపిస్తే మాన్కోజెబ్ లేదా కాపర్ ఆధారిత మందులు పిచికారీ చేయాలి.
పూల పంటలు: పువ్వులు కుళ్లకుండా నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.
కొబ్బరి, పపయ: గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల చుట్టూ నేల దృఢంగా చేయాలి, వాలకుండా చూడాలి.
అత్యవసర సూచనలు:
పంట నష్టాన్ని గమనించిన రైతులు వెంటనే స్థానిక వ్యవసాయ అధికారి / ఉద్యాన శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
వర్షాల తరువాత పంటలు పునరుద్ధరణకు సంబంధించిన సూచనలు జిల్లా ఉద్యాన శాఖ ద్వారా అందించబడతాయి.
రైతులు పంటలను రక్షించుకోవటానికి శాఖల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, సహజ విపత్తు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కూరగాయలు :
టమాట, వంకాయ, ఉల్లి, మిరప, బెండ, తీగ జాతి కూరగాయలలో తీసుకోవలసిన చర్యలు
పొలంలో నిలిచిన నీటిని తీసివేయాలి. పంట మీద 13-0-45 @ 5 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మొక్కలకు మట్టిని ఎగదోయాలి, నిటారుగా పెరిగే మొక్కలకు ఊతమివ్వాలి, 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు యూరియా ద్రావణం @ 10 గ్రా / లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి, చనిపోయిన మొక్కలను తీసివేసి ఆ ప్రదేశంలో మల్లి విత్తుట లేదా నారు నాటుట చేపట్టాలి కలుపు నివారణకు అంతర కృషి చర్యలు చేపట్టాలి, 19-19-19 @ 5 గ్రా లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి, తరువాత సూక్ష్మపోషక మిశ్రమం @ 2.5 గ్రా, లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి, మిరపలో 10 గ్రా యూరియా + 10 గ్రా చక్కర ఒక లీటరు నీటికి చొప్పున కలిపి వారం వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.. మొక్కలు ఎక్కువ కాలం నీటిలో మునిగినట్లైతే మెగ్నిషియం సల్ఫేట్ 5 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి, ఇనుము ధాతువు లోపం కనిపించినట్లైతే 50 గ్రా అన్నభేది + 10 గ్రా నిమ్మఉప్పు 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఆకు మచ్చ, బూడిద బూజు తెగుళ్ల నివారణకు కార్బన్డజిమ్ + మాంకోజెబ్ 2.5 గ్రా, లీటరు నీటికి చొప్పున కలిపి వారం వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
కాయ తొలుచు పురుగుల నివారణ కోసం నోవాల్యూరాన్ 0.75 ml లీటరు నీటికి చొప్పున లేదా థయోధికార్బ్ 1 గ్రా, లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బాక్టీరియా ఆకు మచ్చ తెగులు, కోనోఫోరా ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రా + ప్లాంటమైసిన్ 1 గ్రా 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి., కాయ కుళ్ళు, పక్షి కన్ను తెగులు నివారణకు ప్రొపికోనజోల్ 1 ml లీటరు నీటికి లేదా డైఫెంకోనజోల్ 0.5 ml లీటరు నీటికి చొప్పున కలిపి వారం న్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
బంతి, నారు దశలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా/లీ (లేదా) కార్బెండజిమ్ – 2 గ్రా/లీటర్ లేదా క్యాప్టాన్ @ 2 గ్రా స్ప్రే (లేదా) మొక్క మొదలులో పోయాలి.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులను జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
