గద్దెనెక్కింది ఉద్యమకారులను బలి తీసుకోవడానికే ..నా ?
- ఉద్యమకారుల అరెస్టులపై కప్పాటి పాండురంగా రెడ్డి ఆగ్రహం
- హామీలు ఏమయ్యాయని నిలదీత.. ప్రజాపాలన అంటే ఇదేనా?
రంగారెడ్డి:
తెలంగాణ తెచ్చినోళ్లను ఇళ్లకు వెళ్లి అరెస్టు చేయడం, గృహనిర్బంధాలు చేయడమేనా మీరు చెప్పిన 'ప్రజా పాలన'? అని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అనైతిక చర్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దారుణమని మండిపడ్డారు.
అర్ధరాత్రి అరెస్టులు దేనికి సంకేతం?
"తెల్లవారుజామునే ఉద్యమకారుల ఇళ్లపై పడి, వారిని భయాందోళనకు గురిచేస్తూ అరెస్టులు చేయడం దేనికి సంకేతం? ప్రజల గొంతు నొక్కితే పాలన సాగుతుందని అనుకోవడం మీ భ్రమ" అని పాండురంగా రెడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే, అరెస్టులతో అణచివేయాలని చూడటం ప్రభుత్వ అసమర్థతేనని విమర్శించారు.
అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట ఫలితంగానే నేడు ముఖ్యమంత్రి, మంత్రులు పదవుల్లో కూర్చున్నారని ఆయన గుర్తు చేశారు. "నాడు ఉద్యమకారుల భుజాల మీద ఎక్కి పదవులు పొంది, నేడు అదే ఉద్యమకారులను జైల్లో పెట్టించడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి" అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మొండివైఖరి వీడి, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే భవిష్యత్తులో ఉద్యమకారుల నుంచి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
