భారీ వాహనాలు సిటీలోకి నో ఎంట్రీ...
- మల్కాజిగిరి పోలీస్ కమీషనరేట్ పరిధిలో కొత్త నిబంధనలు
- ఏప్రిల్ 1 నుండి కఠినంగా నిబంధనలు అమలు
ఎల్బీనగర్:
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. డీసీఎం నీళ్ల ట్యాంకర్లు రెడీమిక్స్ వాహనాలు లారీలు, జేసీబీలు, ట్రాక్టర్లు, ప్రైవేట్ బస్సులు ఇతర భారీ వాహనాల రాకపోకలు ఉదయం 7.30 నుండి 11.30 గంటల మధ్య, మధ్యాహ్నం 3.30 నుండి రాత్రి 10.30 గంటల మధ్య రాకపోకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రద్దీ తక్కువగా ఉండే మిగిలిన సమయంలోనే వాహనాలు ప్రయాణించడానికి అనుమతించారు. ఈ ఆంక్షలు స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులకు వర్తించమని స్పష్టం చేశారు. బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట, బోయినపల్లి, గోపాలపురం, మారేడుపల్లి, తుకారాం గేట్, మల్కాజిగిరి, నేరేడ్మెట్, ఎల్బీనగర్, చైతన్యపురి, నాగోల్, ఉప్పల్, నాచారం, కుషాయిగూడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని మార్గాల్లో భారీ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. పదిమంది కంటే ఎక్కువ మంది ప్రయాణం చేసే ప్యాసింజర్ ఇతర గూడ్స్ వాహనాలు పిఎన్టీ, సిటిఓ వైఎంసీఏ, బైరామల్ గూడ ఫస్ట్ లెవెల్ రెండో లెవెల్ వంతెనల మీద అన్ని సమయాల్లో ప్రయాణాన్ని నిషేధించారు. వచ్చే ఏప్రిల్ 1వ తారీకు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని, అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ప్రభుత్వ వాహనాలకు ఈ నిబంధనలు వర్తించమని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
