ఈనెల 30న అసెంబ్లీ ముట్టడిస్తాం : టీ.యూ.ఎఫ్.
- హామీలు అమలు చేయకుంటే సహించేది లేదు
- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ హెచ్చరిక
ఎల్బీనగర్:
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30వ తేదీన 'అసెంబ్లీ ముట్టడి' చేపట్టనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రకటించింది. బుధవారం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని రాష్ట్ర కార్యాలయంలో ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జెనిగె విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
మూడేళ్లుగా కమిటీ ఊసేలేదు..
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చొరవ లేదని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ ఈ ముట్టడికి తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని ఉద్యమకారులు పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఈనెల 30న జరిగే అసెంబ్లీ ముట్టడిలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు
రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కారింగుల నరేందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు జానకి రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆడాల యాదయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు తండ ఉపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు నౌసు ఇంద్ర, జిల్లా సెక్రెటరీ సంగీపేటి నరేష్ కుమార్, ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి మాల కృష్ణ, జనరల్ సెక్రెటరీ రామ్ సాగర్, కిషోర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
