ఆఫీసర్స్ కాలనీ పోరాటం గెలిచింది!

  • ​30 ఏళ్ల కబ్జా కోరల నుంచి పార్కుకు విముక్తి
  • తప్పుడు ఎల్ఆర్ఎస్‌లు.. నకిలీ పత్రాలకు చెక్
  • కాలనీవాసులను సన్మానించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఆఫీసర్స్ కాలనీ పోరాటం గెలిచింది!

​హైదరాబాద్:

 అది ఒకట్రెండు ఏళ్ల పోరాటం కాదు.. ఏకంగా మూడు దశాబ్దాల యుద్ధం. బడా కబ్జాదారులు, అండగా నిలిచిన కొందరు అధికారులు.. వెరసి పార్కు స్థలాన్ని మింగేయాలని చూశారు. కానీ, ఆ రిటైర్డ్ ఉద్యోగుల పట్టుదల ముందు అక్రమార్కులు మోకరిల్లక తప్పలేదు. ఆర్కే పురం ఆఫీసర్స్ కాలనీలో 3 వేల గజాల పార్కు స్థలం ఎట్టకేలకు కాలనీవాసుల వశమైంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్థానికులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సన్మానించారు.

​అధికారులను బురిడీ కొట్టించి..
​1968లో ఏర్పడిన ఈ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. 1997 నుంచే ఈ వివాదం మొదలైంది. కోర్టులు 'ఇది పార్కు స్థలమే' అని తేల్చి చెప్పినా, అక్రమార్కులు వెనక్కి తగ్గలేదు. సిబ్బందిని మేనేజ్ చేసి 2008లో ఎల్ఆర్ఎస్ (LRS) కూడా పొందారు. 2011లో ఏకంగా నిర్మాణ అనుమతులు తెచ్చుకుని జేసీబీలతో రంగంలోకి దిగారు. కానీ కాలనీవాసులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు.

​హైడ్రా ఎంట్రీతో సీన్ రివర్స్
​ఏళ్ల తరబడి కోర్టు మెట్లు ఎక్కి అలసిపోయిన స్థానికులు.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న 'హైడ్రా' ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా యంత్రాంగం.. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అధికారులను బురిడీ కొట్టించారని తేల్చింది. హైకోర్టు స్టే ఎత్తివేయగానే, ఈ నెల 25న హైడ్రా బలగాలు 'సర్జికల్ స్ట్రైక్' తరహాలో ఆక్రమణలను కూల్చేశాయి. ఫెన్సింగ్ వేసి బోర్డులు పాతాయి.

​"మీరే మాకు స్ఫూర్తి"
"సాధారణంగా మేం ఆక్రమణలు తొలగిస్తే జనం వచ్చి మమ్మల్ని సన్మానిస్తారు. కానీ, మీరు చేసిన పోరాటం సామాన్యమైంది కాదు. రిటైర్మెంట్ తర్వాత కూడా పర్యావరణం కోసం, సమాజం కోసం ఇంతలా పోరాడటం గొప్ప విషయం. అందుకే మిమ్మల్ని గౌరవించుకుంటున్నాం" అని కమిషనర్ రంగనాథ్ కొనియాడారు.

​అక్రమ అనుమతులు రద్దు
​కేవలం ఆక్రమణలు తొలగించడమే కాకుండా.. కబ్జాదారులకు ఇచ్చిన ఎల్ఆర్ఎస్, నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు హైడ్రా లేఖలు రాసింది. దీంతో మూడు దశాబ్దాల అక్రమ దందానికి తెరపడింది. తమ పార్కు తమకు దక్కడంతో కాలనీవాసులు సంబరాలు చేసుకుంటున్నారు.WhatsApp Image 2026-03-30 at 18.49.04 (1)

About The Author