మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదు

- రెండు రోజుల క్రితం సీపీ కార్యాలయానికి వెళ్లిన దంపతులు  
- సీఐ ఆధ్వర్యంలో దుబ్బాక ఠాణాలో కౌన్సిలింగ్  
- తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక 
- దుబ్బాక  సీఐ టి. రాజేష్ 

మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు  ఫిర్యాదు

సిద్దిపేట:

తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక సీఐ  టి.రాజేష్ అన్నారు. నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం జరిగింది. దుబ్బాక సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు నరేష్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు.వీరికి ఒక ఇల్లు తో పాటు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.రెండవ కుమారుడు స్వామి, మూడవ కుమారుడు ఎల్లం ప్రతిరోజూ మద్యం సేవించి, తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నట్టు తల్లిదండ్రులు వాపోయారు. గతంలో ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే అప్పటి దుబ్బాక సీఐ వారి కుమారులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కుమారుల వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో వారి వేధింపులు భరించలేక, ప్రాణభయంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం నాలుగు రోజుల క్రితం సిద్దిపేటకు వెళ్లి, అక్కడి రోడ్లమీద నివాసమున్నారు. రెండు రోజుల క్రితం వృద్ధ తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కొడుకుల వేధింపులు భరించలేకపోతున్నామని, తమకు ప్రాణహాని ఉందంటూ ఇద్దరు కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనితో సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ఆదివారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిఐ టి.రాజేష్, ఎస్సై కీర్తి రాజు ఆధ్వర్యంలో  వృద్ధ తల్లిదండ్రులను, వేధిస్తున్న ఇద్దరూ కొడుకులను పిలిపించి, వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు.అనంతరం తల్లిదండ్రులను వారింటికి చేర్చారు. తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుమారులను హెచ్చరించారు. సిపి ఆదేశాల మేరకు ముగ్గురు కుమారులపై, కుమార్తెపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేష్ తెలిపారు.

About The Author