ఖాకీల సంక్షేమానికి ‘ఇంధన’ భరోసా!
● బేగంపేటలో పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ప్రారంభం
● ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
● ఆదాయం మొత్తం సిబ్బంది సంక్షేమ నిధికే..
● ఏప్రిల్ 1 నుంచి సామాన్యులకు అందుబాటులోకి
బేగంపేట:
పోలీసుల సంక్షేమానికి భరోసానిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది. విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే సిబ్బంది కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా బేగంపేటలో నూతనంగా నిర్మించిన 'తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్'ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి, ఐజీపీ (ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్) గజరావు భూపాల్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసిన డీజీపీ.. ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు.
సంక్షేమ నిధికి ఊతం:
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సిబ్బంది ఆర్థిక పరిపుష్టి కోసం ఇలాంటి ప్రాజెక్టులు అవసరమని పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే లాభాలను పూర్తిగా పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు మళ్లిస్తామని చెప్పారు. దీనివల్ల పోలీసు కుటుంబాలకు వైద్య, విద్యా సంబంధిత సాయం అందించడం సులభతరమవుతుందన్నారు.
"నాణ్యమైన ఇంధనాన్ని అందించడమే మా లక్ష్యం. కల్తీకి తావులేకుండా ప్రజల నమ్మకాన్ని ఈ బంక్ గెలుచుకుంటుంది."
— డీజీపీ శివధర్ రెడ్డి
నగరవాసుల సౌకర్యార్థం ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి తెలిపారు. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మెలిగేలా, నాణ్యతలో రాజీ పడకుండా సేవలు అందించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఐఓసీఎల్ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

