సరూర్ 'నగర్'లో పైసల మ్యుటేషన్!
- సీఎం '99 డేస్ యాక్షన్ ప్లాన్'కు అధికారుల తూట్లు
- పెండింగ్ ఫైళ్లలో నంబర్ 1.. వసూళ్లలోనూ సాటిలేరు
- డీసీ, ఏఎంసీల కనుసన్నల్లోనే కాసుల వేట.. జనం బేజారు
హైదరాబాద్:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకగా చేపట్టిన '99 డేస్ యాక్షన్ ప్లాన్' ఆశయాలు సరూర్ నగర్ సర్కిల్ ఆఫీసు మెట్లు ఎక్కలేకపోతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మార్చి 7న నిర్వహించిన "ఫైల్ క్లియరెన్స్ డే"ని ఇక్కడి అధికారులు లైట్ తీసుకున్నారు. సాక్షాత్ సీఎం ఆదేశాలనే బేకాతర్ చేస్తూ, ఫైళ్ల క్లియరెన్స్‌ను కాసుల వేటగా మార్చుకున్నారు. మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులను నెలల తరబడి తొక్కిపెడుతూ, బాధితులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే.. అటు డీసీ, ఇటు ఏఎంసీ ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
పెండెన్సీలో రికార్డు.. అంతా 'మామూలే'!
మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 60 సర్కిళ్లలో ఎక్కడా లేనంత పెండెన్సీ ఒక్క సరూర్ నగర్ సర్కిల్‌లోనే ఉండటం గమనార్హం. ఇతర సర్కిళ్లలో ఆస్తి పన్ను సవరణ దరఖాస్తులు 50 లోపు ఉంటే, ఇక్కడ ఏకంగా 191 దరఖాస్తులు లలో 60 దరఖాస్తులు ఆస్థి పన్ను సవరణ చేసినప్పటికీ పెండింగ్ అని చూపిస్తున్నాయి మిగిలిన దాదాపు 131 ఆస్తి పన్ను సవరణ దరఖాస్తులు పెండింగ్ లోనే వున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులే సమయం ఉండటంతో, గత ఏళ్ల వడ్డీ భారం పడుతుందని సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి అనధికార వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి..jpeg)
మ్యుటేషన్లకూ ముడుపుల మందు!
మ్యుటేషన్ల విషయంలోనూ సరూర్ నగర్ సర్కిల్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ 59 మ్యుటేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, మిగతా సర్కిళ్లలో ఈ సంఖ్య 10 నుంచి 20 లోపే ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న సామాన్యులకు నెలలు' గడిచినా మోక్షం కలగడం లేదు కానీ, 'ప్రత్యేక చొరవ' (ముడుపులు) చూపిన వారికి మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే ఫైల్ క్లియర్ అయిపోతుండటం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది.
బాధితులు తమ గోడు చెప్పుకుందామని ఏఎంసీని కలిస్తే "డీసీ దగ్గరకు వెళ్లండి" అని, డీసీని కలిస్తే "నాకేం సంబంధం.. ఏఎంసీని అడగండి" అని బంతులాట ఆడుతున్నారు. ఏఎంసీ లాగిన్‌లో నెలల తరబడి ఆగిపోతున్న ఫైళ్లు, అక్కడి నుంచి కదిలినా డీసీ లాగిన్‌లో మళ్ళీ తిష్ట వేస్తున్నాయి. డీసీ స్థాయిలోనే అనధికారిక డిమాండ్లు ఉండటంతో దిగువ స్థాయి సిబ్బంది కూడా నోరు మెదపడానికి భయపడుతున్నట్లు చర్చ సాగుతోంది.
బాసులను తప్పుదోవ పట్టిస్తూ..
పైస్థాయి అధికారుల నుంచి నోటీసులు వచ్చినా, "అంతా సవ్యంగా ఉంది" అంటూ తప్పుడు నివేదికలు పంపి జోనల్ కమిషనర్‌ను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చి, విచారణ జరగకుండా మేనేజ్ చేయడంలో ఇక్కడి అధికారులు సిద్ధహస్తులనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి అవినీతి అధికారులపై వేటు వేయాలని స్థానికులు కోరుతున్నారు..jpeg)
