నిజాంపేట, పేట్ బషీరాబాద్ స్థలాలే కేటాయించాలి
కమిటీ అక్రమాలపై విచారణ జరపాలి: సీఎం రేవంత్‌రెడ్డికి జేఎన్‌జేహెచ్‌ఎస్ సభ్యుల విజ్ఞప్తి
హైదరాబాద్:
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ (జేఎన్‌జేహెచ్‌ఎస్) సభ్యులకు గత 16 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై విచారణ జరిపించాలని, తమకు కేటాయించిన నిజాంపేట, పేట్ బషీరాబాద్ స్థలాలనే తక్షణమే అప్పగించాలని సొసైటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు తమ ఆవేదనను వెల్లడించారు.
కమిటీ అక్రమాలపై ధ్వజం:
సొసైటీ ఏర్పడిన నాటి నుంచి కొందరు కమిటీ పెద్దలు సభ్యులను తప్పుదోవ పట్టిస్తూ కుట్రలకు పాల్పడ్డారని సభ్యులు ఆరోపించారు.
నిధుల మళ్లింపు: 2008లో సొసైటీ సభ్యుల నుంచి సుమారు ₹23 కోట్లు వసూలు చేయగా, ప్రభుత్వ ఖజానాకు కేవలం ₹12.33 కోట్లు మాత్రమే జమ చేశారని తెలిపారు. మిగిలిన నిధులను సభ్యుల అనుమతి లేకుండా దుబారా చేశారని ధ్వజమెత్తారు.
న్యాయపరమైన జాప్యం: 2010లో హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, దానిని సభ్యులకు తెలియనివ్వకుండా దాచిపెట్టి, జనరల్ బాడీ (జీబీ) సమావేశం నిర్వహించకుండానే సుప్రీంకోర్టుకు వెళ్లారని విమర్శించారు.
నిర్మాణాల్లో జాప్యం: 2017, 2022 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు సానుకూల తీర్పులు ఇచ్చినప్పటికీ, కమిటీ పెద్దలు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ సభ్యులను ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాంపేట, పేట్ బషీరాబాద్ స్థలాలే ముఖ్యం
గతంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తమ సమస్యను విన్నవించగా, అధికారంలోకి వచ్చిన వెంటనే పేట్ బషీరాబాద్ స్థలాన్ని అప్పగించినందుకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకోకుండా కమిటీ ప్రతినిధులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
90 మంది సభ్యుల మృతి
సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరాటంలో ఇప్పటివరకు 90 మంది సభ్యులు కన్నుమూశారని, మరో 200 మందికి పైగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి తమకు అపాయింట్‌మెంట్ ఇస్తే కమిటీ పెద్దలు చేసిన మోసాలను, అక్రమ కట్టడాల వెనుక ఉన్న వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని సభ్యులు వేడుకున్నారు. బడా జర్నలిస్టుల పేరుతో సాగుతున్న కుట్రలను అరికట్టి, సామాన్య జర్నలిస్టులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
