ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా వై. నరేందర్ రెడ్డి ఎన్నిక.
ఘనంగా సన్మానించిన రంగారెడ్డి జర్నలిస్టులు
హైదరాబాద్:
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా వై. నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ ) 11వ ప్లీనరీ సమావేశాలు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రియ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం నాడు నూతన జాతీయ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ప్లీనరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రులు పార్థ సారథి, నిమ్మల రామకృష్ణ , టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణ దేవరాయులు, ఎంపీ అప్పల నాయుడు,మాజీ కేంద్ర మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు, రెండు తెలుగు రాష్టాల మీడియా అకాడమీ చైర్మన్లు కే శ్రీనివాస్ రెడ్డి, ఆలపాటి సురేష్, మాజీ జాతీయ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రామ్ నారాయణ, 25 రాష్టాల నుండి ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ నేత వై. నరేందర్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ఈ పదవి లభించడంతో తెలంగాణ ముఖ్యంగా రంగారెడ్డి జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. మొయినాబాద్ మండలం కనక మామిడి గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి గత అనేక దశబ్దాలుగా వివిధ ప్రముఖ దినపత్రికలలో పనిచేసి ప్రస్తుతం ముద్ర పత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అదేవిదంగా యూనియన్ లో అనేక సంవత్సరాలనుండి వివిధ పదవులు నిర్వహించి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడ పనిచేశారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి,రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాల్ రాజ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రవీణ్ కుమార్, శివ కుమార్ , నాగేంద్ర చారి తదితరులు నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.నరేందర్ రెడ్డి ఎన్నికతో తెలంగాణ జర్నలిస్టుల ప్రతిష్ట మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి చరిత్రలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ లో కీలక బాధ్యత చేపట్టబోతున్న నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిదంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు బల్విందర్ సింగ్ జమ్మూ, సోమ సుందర్ లకు, ఈసి సభ్యులగా ఎన్నికైన సత్యనారాయణ, శేఖర్, అజిత, శ్రీనివాస్ లకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
