జీహెచ్‌ఎంసీ కార్మికుల గోస.. పైసలు కట్ అవుతున్నా ఖాతాల్లో సున్నా!

  • ​- పదేళ్లు దాటినా తేలని సీపీఎస్ లెక్కలు
  • - యూనిఫాం లేదు.. కుట్టు కూలీ రాదు
  • - ప్రమోషన్ల కోసం ఎదురుచూపులు.. స్పెషల్ ఆఫీసర్‌కు ఎంప్లాయీస్ వినతి

జీహెచ్‌ఎంసీ కార్మికుల గోస.. పైసలు కట్ అవుతున్నా ఖాతాల్లో సున్నా!

హైదరాబాద్:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో పనిచేస్తున్న క్లాస్-IV కార్మికుల పరిస్థితి 'అడకత్తెరలో పోకచెక్క'లా మారింది. ఒకవైపు ఏళ్ల తరబడి చేస్తున్న చాకిరికి గుర్తింపు లేక, మరోవైపు జీతం నుంచి కట్ అవుతున్న పైసలు ఎటు పోతున్నాయో తెలియక కార్మికులు లబోదిబోమంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ మంగళవారం స్పెషల్ ఆఫీసర్‌కు వినతి పత్రాలు అందజేసింది.

​కట్ చేస్తున్నరు.. కానీ జమ చేస్తలేరు!
​2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి నెలా వారి జీతాల నుంచి సీపీఎస్ (CPS/NPS) వాటా కింద రికవరీ చేస్తున్న అధికారులు, ఆ మొత్తాన్ని వారి పీఆర్ఏఎన్ (PRAN) ఖాతాల్లో జమ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "ఏళ్లుగా మా జీతం నుంచి పైసలు కట్ అవుతున్నాయి.. కానీ అకౌంట్ చూస్తే మాత్రం నిల్ చూపిస్తోంది" అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన మినహాయింపుల లెక్క తేల్చాలని, వెంటనే స్టేట్‌మెంట్లు ఇవ్వాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది.WhatsApp Image 2026-04-05 at 20.46.29

​యూనిఫాం ఇవ్వరు.. కుట్టు కూలీ పెంచరు
​మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాం విషయంలోనూ నిర్లక్ష్యం వీడటం లేదు. టీజీఎస్‌సీఓ (TGSCO) నుంచి బట్టలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని, పెంచిన కుట్టు ఛార్జీలను చెల్లించాలని 2025లోనే సర్క్యులర్లు జారీ అయినా.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. 2023-24 నుంచి 2025-26 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని యూనియన్ నేతలు విన్నవించారు.

​రిటైర్మెంట్ దగ్గర పడుతున్నా.. రాని పదోన్నతి
​దశాబ్దాలుగా నగరానికి సేవ చేస్తున్న మాలీలు, మాలన్లు, శానిటరీ జవాన్ల పదోన్నతుల ఫైలు దుమ్ము పడుతోంది. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సీనియర్లకు 'హెడ్ మాలీ', 'హెడ్ జవాన్'లుగా ప్రమోషన్ ఇచ్చి గౌరవించాలని కార్మికులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారికి శిక్షణ ఇచ్చి శానిటరీ సూపర్వైజర్లుగా నియమించడంలో తాత్సారం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.WhatsApp Image 2026-04-05 at 20.31.16

​తక్షణమే స్పందించాలి:
కార్మికుల కష్టార్జితమైన సీపీఎస్ నిధులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, నిలిచిపోయిన ప్రమోషన్లు, యూనిఫాం నిధులను విడుదల చేయాలని యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.

About The Author