సిటీలో ‘ఎండీఎంఏ’ కలకలం.. ఇద్దరు పెడ్లర్ల అరెస్ట్!

  • ​నాగోల్ ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్న ఎస్ఓటీ, పోలీసులు
  • ​25.65 గ్రాముల డ్రగ్స్, 2 బైకులు స్వాధీనం
  • ​మెయిన్ విలన్ అన్సారీ కోసం వేట..

సిటీలో ‘ఎండీఎంఏ’ కలకలం.. ఇద్దరు పెడ్లర్ల అరెస్ట్!

ఎల్బీనగర్:

గ్రేటర్ సిటీలో డ్రగ్స్ దందా మళ్లీ పడగ విప్పింది. తాజాగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్ మరియు నాగోల్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ. 3.61 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

​సన్ సిటీ దోస్తీ.. డ్రగ్స్ దందా!
​పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకికి చెందిన జునైద్ రజా సిద్ధిఖీ (36) ఒక ఐటీ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కలకత్తాకు చెందిన సునీల్ సుబ్బా అలియాస్ జానీ (29) బండ్లగూడలోని సన్ సిటీలో ఉంటున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ నడిపేవారు. ఈ క్రమంలోనే వీరికి మహ్మద్ అన్సారీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అన్సారీ హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తెప్పించి, రాజు అనే మరో వ్యక్తి ద్వారా ఈ జునైద్, సునీల్‌లకు అందజేసేవాడు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ఇద్దరూ పెడ్లర్లుగా మారి సిటీలో డ్రగ్స్ సప్లై చేయడం మొదలుపెట్టారు.WhatsApp Image 2026-04-02 at 19.02.42

​పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు..
​డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం నాగోల్ ఎక్స్ రోడ్ వద్ద నిఘా పెట్టారు. రెండు యాక్టివా వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న జునైద్, సునీల్‌లను ఆపి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. డిక్కీలోని నల్లటి బ్యాగులో పాలిథిన్ కవర్లలో దాచిన 25.65 గ్రాముల ఎండీఎంఏ దొరికింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి డ్రగ్స్‌తో పాటు 3 ఫోన్లు, నగదు, వెయింగ్ మెషిన్, రెండు బైకులను సీజ్ చేశారు.

​సూత్రధారుల కోసం గాలింపు
​ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ ముఠాలో కీలక సూత్రధారులైన మహ్మద్ అన్సారీ, రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసులు కోరారు.WhatsApp Image 2026-04-02 at 19.02.43 (1)

About The Author