ట్రేడింగ్‌‌ ‘నిలువు దోపిడీ’.. నిందితులు ఏపీ స్టూడెంట్లు!

  • ​నకిలీ యాప్‌‌తో నాగోల్ ఫ్యాకల్టీకి రూ. 36 లక్షల నామం
  • ​ఏడు కోట్ల లాభమని నమ్మించి సీన్ రివర్స్.. పెద్దమీరంలో కాల్ సెంటర్ గుట్టురట్టు

ట్రేడింగ్‌‌ ‘నిలువు దోపిడీ’.. నిందితులు ఏపీ స్టూడెంట్లు!

​మల్కాజిగిరి

పెట్టుబడి తక్కువ.. లాభం కోట్లలో అంటూ ఊదరగొట్టే సైబర్ గాళ్ల మాటలు నమ్మి ఓ ఫ్యాకల్టీ నిలువునా మునిగిపోయాడు. 'ట్రేడింగ్' ముసుగులో సాగుతున్న భారీ దందాను మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్ సెంటర్ పెట్టి అమాయకులను దోచుకుంటున్న ఎనిమిది మంది ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 45 మొబైల్ ఫోన్లు, 40 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

​వాట్సాప్ గ్రూపే వల..
​నాగోల్‌‌కు చెందిన ఫ్యాకల్టీ నవీన్ చందర్‌‌ను నిందితులు ‘Barclays’ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా టార్గెట్ చేశారు. తమ ప్లాట్‌‌ఫారమ్‌‌లో ఇన్వెస్ట్ చేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని నమ్మించారు. నమ్మకం కుదిరించేందుకు ఒక ఫేక్ ప్లాట్‌‌ఫారమ్‌‌ను క్రియేట్ చేసి, అందులో బాధితుడికి ఏకంగా రూ. 7 కోట్ల లాభం వచ్చినట్లు గ్రాఫిక్స్ చూపించారు. ఆ స్క్రీన్ చూసి నిజమేనని నమ్మిన బాధితుడు.. తన దగ్గరున్న డబ్బుతో పాటు అప్పులు చేసి మరీ వివిధ విడతల్లో రూ. 36.30 లక్షలు నిందితులు చెప్పిన అకౌంట్లలో జమ చేశాడు. తీరా డబ్బులు డ్రా చేద్దామనుకుంటే ‘ట్యాక్స్’ కట్టాలని వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

​నిందితులంతా కుర్రాళ్లే..
​ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఇన్‌‌స్పెక్టర్ సుధాకర్ టీమ్.. టెక్నికల్ ఆధారాలతో నిందితులు ఏపీలో ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమీరం గ్రామంలోని ఓ ఇంట్లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు కనిపెట్టి మెరుపు దాడి చేశారు. అరెస్టయిన ఎనిమిది మందిలో ఏ1 తో పాటు ఏ3 నుంచి ఏ9 వరకు నిందితులు ఉన్నారు. వీరంతా కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు. ఇందులో చదువుకునే స్టూడెంట్లు, డ్రైవర్లు ఉండటం గమనార్హం.

​సామగ్రి చూసి పోలీసులే షాక్!
​నిందితుల స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్న సామాగ్రి చూస్తే దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది.
​గ్యాడ్జెట్స్: 45 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌‌టాప్, మూడు రౌటర్లు, రెండు ట్యాబ్‌‌లు.
​బ్యాంకింగ్: 40 ఏటీఎం కార్డులు, 22 చెక్ బుక్కులు, 20 సిమ్ కార్డులు.
​ఐడెంటిటీ: 5 ఆధార్ కార్డులు, పాన్ కార్డులను సీజ్ చేశారు.

​ఆశ పడితే అడ్రస్ లేకుండా పోతారు..
​తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇచ్చే అడ్వైజ్‌‌లను నమ్మి ఇన్వెస్ట్ చేయవద్దని కోరారు. ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు. సీపీ అవినాష్ మొహంతి, డీసీపీ నాగ లక్ష్మి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

About The Author