బడంగ్‌పేట్ సర్కిల్‌లో ' 40.25 కోట్ల పన్నుల వసూలు
- గత ఏడాదితో పోలిస్తే గణనీయ వృద్ధి
- 70.89 శాతం లక్ష్యం పూర్తి
- సహకరించిన నగర ప్రజలకు అధికారుల కృతజ్ఞతలు
బడంగ్‌పేట్:
బడంగ్‌పేట్ సర్కిల్-16 (శంషాబాద్ జోన్) పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లు ఉత్సాహంగా సాగాయి. మార్చి 31వ తేదీతో ముగిసిన గడువు నాటికి ఈ సర్కిల్‌లో రికార్డు స్థాయిలో రూ. 40.25 కోట్ల పన్ను వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వసూళ్లు ఆశాజనకంగా ఉండటం పట్ల మున్సిపల్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
లక్ష్యం దిశగా..
సర్కిల్ పరిధిలో మొత్తం రూ. 76.52 కోట్ల మేర పన్ను డిమాండ్ ఉండగా, పలు సాంకేతిక కారణాల వల్ల కొంత మొత్తం మినహాయింపునకు గురైంది. పౌల్ట్రీ షెడ్లు, కూలిపోయిన గృహాలు మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కొత్తగా వచ్చిన ఇంటి నంబర్లకు సంబంధించిన సుమారు రూ. 14 కోట్ల బకాయిలను పరిగణనలోకి తీసుకోగా, నికర వసూళ్లలో 70.89 శాతం లక్ష్యాన్ని అధికారులు చేరుకున్నారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి పన్ను రికవరీని వేగవంతం చేశారు.
పన్ను చెల్లింపులపై నగర ప్రజల్లో పెరిగిన అవగాహనే ఈ విజయానికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. పట్టణ మౌలిక వసతుల కల్పనకు పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లించడం శుభపరిణామమని కొనియాడారు. ఈ క్రమంలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించిన కాలనీ అసోసియేషన్ల సభ్యులకు, పౌరులకు మరియు సమాచార వ్యాప్తిలో తోడ్పడిన పాత్రికేయ మిత్రులకు జిహెచ్‌ఎంసీ (GHMC) డిప్యూటీ కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
