ఎల్బీనగర్ జోన్ @ సరూర్ 'నగదు' సర్కిల్.. మ్యుటేషన్ అంటేనే ముడుపుల పండుగ!

  • సీ.ఎం '99 డేస్ యాక్షన్ ప్లాన్'కు అధికారుల తూట్లు
  • ​పెండింగ్ ఫైళ్లలో నంబర్ 1.. వసూళ్లలోనూ సాటిలేరు
  • ​డీసీ, ఏఎంసీల కనుసన్నల్లోనే కాసుల వేట.. జనం బేజారు
  • ​ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఆస్తి పన్ను 'వసూల్' రాజా ఆటలు
  • సరూర్నగర్ సర్కిల్, అవినీతి అధికారులపై , ఎం.ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ప్రత్యేక అధికారి జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీ.ఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకునేనా...?

ఎల్బీనగర్ జోన్ @ సరూర్ 'నగదు' సర్కిల్.. మ్యుటేషన్ అంటేనే ముడుపుల పండుగ!

హైదరాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకగా చేపట్టిన '99 డేస్ యాక్షన్ ప్లాన్' ఆశయాలు సరూర్ నగర్ సర్కిల్ ఆఫీసు గుమ్మం కూడా దాటలేకపోతున్నాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వం గీసిన గీతను ఇక్కడి అధికారులు తుడిచేస్తున్నారు. మార్చి 7న నిర్వహించిన "ఫైల్ క్లియరెన్స్ డే"ని అభాసుపాలు చేస్తూ, సాక్షాత్ సీఎం ఆదేశాలనే బేకాతర్ చేస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌ను ప్రజా సేవగా కాకుండా.. 'కాసుల వేట'గా మార్చుకున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​పెండెన్సీలో రికార్డు.. అంతా 'మామూలే'!

​మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 60 సర్కిళ్లలో ఎక్కడా లేనంత పెండెన్సీ ఒక్క సరూర్ నగర్ సర్కిల్‌లోనే ఉండటం ఇక్కడి పాలన తీరుకు అద్దం పడుతోంది. ఇతర సర్కిళ్లలో ఆస్తి పన్ను సవరణ దరఖాస్తులు 50 లోపు ఉంటే, ఇక్కడ ఏకంగా 191 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఇందులో 60 దరఖాస్తులు సవరణ పూర్తయినట్లు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో అవి ఇంకా పెండింగ్‌లోనే ఉండటం అధికారుల జిమ్మిక్కులకు నిదర్శనం. ఆర్థిక సంవత్సరం ముగియడానికి (మార్చి 31) కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో, గత ఏళ్ల వడ్డీ భారం పడుతుందని సామాన్యులను భయపెట్టి, తెరవెనుక అనధికార వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

​మ్యుటేషన్లకూ 'ముడుపుల' మందు!
​మ్యుటేషన్ల విషయంలోనూ సరూర్ నగర్ సర్కిల్ అవినీతిలో 'టాప్' గేర్‌లో దూసుకుపోతోంది. ఇక్కడ 59 మ్యుటేషన్ దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా సర్కిళ్లలో ఈ సంఖ్య 10 నుంచి 20 లోపే ఉండటం విశేషం. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న సామాన్యులకు నెలల తరబడి మోక్షం కలగడం లేదు కానీ, 'ప్రత్యేక చొరవ' (ముడుపులు) చూపిన వారికి మాత్రం ఒకట్రెండు రోజుల్లోనే ఫైల్ క్లియర్ అయిపోతోంది. అంటే, ఇక్కడ నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ ఎక్కువన్నమాట!WhatsApp Image 2026-03-31 at 20.47.58

​డీసీ vs ఏఎంసీ.. సామాన్యుల బలి
​బాధితులు తమ గోడు చెప్పుకుందామని ఏఎంసీని కలిస్తే "డీసీ దగ్గరకు వెళ్లండి" అని, డీసీని కలిస్తే "నాకేం సంబంధం.. ఏఎంసీని అడగండి" అని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. ఏఎంసీ లాగిన్‌లో నెలల తరబడి ఆగిపోతున్న ఫైళ్లు, అక్కడి నుంచి కదిలినా డీసీ లాగిన్‌లో మళ్ళీ తిష్ట వేస్తున్నాయి. డీసీ స్థాయిలోనే భారీ డిమాండ్లు ఉండటంతో దిగువ స్థాయి సిబ్బంది కూడా నోరు మెదపడానికి భయపడుతున్నారు. అధికారుల ఈ దోబూచులాటలో సామాన్య జనం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ బలి పశువులవుతున్నారు.

​బాసులను బురిడీ కొట్టిస్తూ..
​పైస్థాయి అధికారుల నుంచి నోటీసులు వచ్చినా, "అంతా సవ్యంగా ఉంది" అంటూ తప్పుడు నివేదికలు పంపి జోనల్ కమిషనర్‌ను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, ఏఎంసీలు బాబురావు, శ్రీనివాసులు తమపై వస్తున్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడంలో సిద్ధహస్తులనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'భారత శక్తి' పత్రిక గత నెల రోజులుగా ఆధారాలతో సహా వార్తలు ప్రచురిస్తున్నా, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదు.

​ప్రభుత్వం స్పందించేనా?
​మున్సిపల్ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ నిధులను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి, అవినీతి అధికారులపై వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.WhatsApp Image 2026-03-31 at 20.47.58 (2)

About The Author