కబ్జాకోరుల గుండెల్లో 'హైడ్రా' వణుకు!

  • పాతబస్తీలో 100 కోట్ల విలువైన ప్లే గ్రౌండ్ విముక్తి
  • ​బాలానగర్‌లో పార్కు స్థలం స్వాధీనం.. 
  • నిర్మాణాల కూల్చివేత
  • శాస్త్రిపురంలో జీ+3 భవనాలు నేలమట్టం
  • ​నోటరీ దందాతో అమ్మేసిన 6,500 గజాల స్థలం రికవరీ
  • ​ఫిర్యాదు అందిన గంటల్లోనే జేసీబీలతో యాక్షన్

కబ్జాకోరుల గుండెల్లో 'హైడ్రా' వణుకు!

హైదరాబాద్:

గ్రేటర్ సిటీలో కబ్జాదారులు, భూబకాసురుల ఆటలకు 'హైడ్రా' చెక్ పెడుతోంది. సామాన్యుల కోసం కేటాయించిన పార్కులు, ఆటస్థలాలను మింగేస్తున్న పెద్దల అక్రమ సామ్రాజ్యాలను జేసీబీలతో కూల్చివేస్తోంది. తాజాగా బుధవారం పాతబస్తీ మైలార్‌దేవుపల్లితో పాటు బాలానగర్‌లో నిర్వహించిన భారీ ఆపరేషన్లలో సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రజా ఆస్తులను హైడ్రా కాపాడింది.

​వెంచర్ వెనుక పెద్దల దందా!
​రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవుపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో 188 ఎకరాల్లో హుడా (HUDA) లేఅవుట్ ఉంది. ఇందులో నిబంధనల ప్రకారం 6,500 గజాలను క్రీడా మైదానం కోసం వదిలిపెట్టారు. అయితే, స్థానిక కబ్జాదారులు కన్ను ఈ ఖరీదైన స్థలంపై పడింది. హెచ్‌ఎండీఏ పర్మిషన్ లేఅవుట్ అని తెలిసి కూడా.. గత మూడేళ్లుగా నోటరీ పత్రాలతో ఇక్కడ ప్లాట్లు చేసి అమాయకులకు విక్రయించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఇక్కడ భవన నిర్మాణాలు చేపట్టారు.

​రంగంలోకి హైడ్రా.. భారీ కూల్చివేతలు.WhatsApp Image 2026-04-01 at 18.25.17 (1)

​స్థానికుల నుంచి ఫిర్యాదు అందడమే ఆలస్యం.. హైడ్రా ఫోర్స్ మైలార్‌దేవుపల్లిలో ల్యాండ్ అయింది. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో లేఅవుట్‌ను పరిశీలించి, అది ఆటస్థలమేనని నిర్ధారించుకుంది. వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టి నిర్మాణ దశలో ఉన్న ఐదు 'జీ ప్లస్ 3' అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. మరో రెండు గదులను కూల్చేసింది. ఇప్పటికే నివాసం ఉంటున్న రెండు భవనాలను మాత్రం ప్రస్తుతానికి మినహాయించింది. సుమారు రూ. 100 కోట్ల విలువైన ఈ మైదానాన్ని మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

​బాలానగర్‌లో పార్కు సేఫ్..
​మరోవైపు బాలానగర్ పరిధిలోని అక్షయ ఎన్‌క్లేవ్‌లోనూ హైడ్రా తన ప్రతాపం చూపింది. 1983 నాటి లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన 968 గజాల స్థలాన్ని అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో కాజేయాలని చూశారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఫెన్సింగ్ వేసినా.. అధికార యంత్రాంగాన్ని బురిడీ కొట్టించి నిర్మాణాలకు ప్లాన్ చేశారు. 'ప్రజావాణి'లో కాలనీవాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. అక్కడ ఆక్రమణలను తొలగించి, అది ప్రభుత్వ స్థలమంటూ బోర్డులు పాతి కబ్జాదారులకు షాక్ ఇచ్చారు.WhatsApp Image 2026-04-01 at 18.25.17

​కాలనీవాసుల హర్షం..
​"కబ్జాదారులను ఎదిరిస్తే మమ్మల్ని బెదిరించారు.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత హైడ్రా వల్ల మా పిల్లల ఆటస్థలం దక్కింది" అంటూ శాస్త్రిపురం కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా తీరుపై నగరవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

About The Author