ఆక్రమణల చెర నుంచి ఊపిరి పోసుకున్న చెరువులు, పార్కులు!

  • ​నగరం నలువైపులా హైడ్రా విరుచుకుపాటు..
  • ​8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటకు విముక్తి.
  • ​రహదారులు, కాలువలపై అక్రమ కట్టడాల కూల్చివేత.
  • ​బడా రియల్టర్లు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు.

ఆక్రమణల చెర నుంచి ఊపిరి పోసుకున్న చెరువులు, పార్కులు!

హైదరాబాద్‌:

హైదరాబాద్‌ మహానగరం చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' (HYDRAA) తన ఉక్కుపాదం మోపుతోంది. మంగళవారం నగరం నలువైపులా మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు.. చెరువులు, పార్కులు, ప్రధాన రహదారులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు.

​నాగిరెడ్డి కుంట కబ్జాకు బ్రేక్!
​గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో కంటికి కనిపించకుండా మాయం చేయాలని చూసిన 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటను హైడ్రా అధికారులు రక్షించారు. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు చెరువు చుట్టూ 20 అడుగుల ఎత్తైన రేకుల గోడలు నిర్మించి, లోపల చెరువు ఉన్న సంగతే తెలియకుండా జాగ్రత్త పడ్డాయి. సుమారు 4 ఎకరాలను ఒక సంస్థ, 3 ఎకరాలను మరో సంస్థ ఆక్రమించగా.. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి సైతం ఎకరం భూమిని అక్రమంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా, ఆ రేకుల గోడలను, తాత్కాలిక గదులను తొలగించి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసింది.

​రహదారులపై ‘షెడ్ల’ దందాకు చెక్

​దుండిగల్ – గండిమైసమ్మ మండలం బౌరంపేటలో ప్రధాన రహదారిని ఆనుకుని వెలిసిన అక్రమ వ్యాపారాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. గండిమైసమ్మ–మియాపూర్ 150 అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మించిన 10 షాపులను (స్క్రాప్ దుకాణాలు) అధికారులు కూల్చివేశారు. వీటి వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని గుర్తించిన అధికారులు, ముందస్తు నోటీసుల అనంతరం ఈ చర్యలు చేపట్టారు. దీంతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న వాహనదారులకు ఉపశమనం లభించింది.WhatsApp Image 2026-03-31 at 19.24.12

​పార్కు స్థలం.. ఇక ప్రజల సొంతం

​ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌లో 1987లో లేఅవుట్ చేసిన సమయంలో కేటాయించిన 1440 గజాల పార్కు స్థలం అక్రమార్కుల చేతిలో చిక్కింది. ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నం చేస్తుండగా, 'ప్రజావాణి'లో అందిన ఫిర్యాదు మేరకు హైడ్రా స్పందించింది. వెంటనే ఆ ప్లాట్లను తొలగించి, ఫెన్సింగ్ వేసి ఇది "పార్కు స్థలం" అని బోర్డులు ఏర్పాటు చేసింది.

​జూబ్లీహిల్స్‌లో వరద కాలువల పరిరక్షణ
​అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో అంగుళం భూమి దొరికినా కాజేయాలనుకునే కబ్జాదారులు.. ఏకంగా వరద కాలువలను (బాక్స్ డ్రైన్లను) కప్పివేసి ప్లాట్లు సృష్టించారు. మాధాపూర్ మెట్రో స్టేషన్ మరియు పెద్దమ్మ గుడి వైపు నుంచి వచ్చే వరద కాలువలపై సుమారు 300 గజాల స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు రట్టు చేసిన హైడ్రా, మంగళవారం ఆ నిర్మాణాలను నేలమట్టం చేసి కాలువలను ఆక్రమణల నుంచి విముక్తి చేసింది.

​ప్రజల హర్షం
​హైడ్రా చేపట్టిన ఈ సత్వర చర్యలపై నగరవాసుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బడా సంస్థల ఒత్తిళ్లకు లొంగకుండా, ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కఠినంగా వ్యవహరిస్తుండటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపుతో భవిష్యత్తులో వరద ముప్పు తగ్గుతుందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.WhatsApp Image 2026-03-31 at 19.24.11

About The Author