విశ్వనగరానికి 'దోమ'పోటు!
నగర బ్రాండ్ ఇమేజ్‌కు గ్రహణం.. పాలకుల నిర్లక్ష్యంపై సుధీర్‌రెడ్డి వినూత్న నిరసన
హైదరాబాద్:
ఒకవైపు ఆకాశాన్ని తాకే భవనాలు.. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో 'విశ్వనగరం'గా వెలుగొందుతున్న హైదరాబాద్‌కు ఇప్పుడు 'దోమ'పోటు తగులుతోంది. నగరం తన అస్తిత్వాన్ని చాటుకుంటున్న వేళ.. అపారిశుద్ధ్యం, దోమల ముసురు భాగ్యనగరాన్ని వెక్కిరిస్తున్నాయి. నగర నిర్వహణను గాలికొదిలేసిన పాలకుల తీరుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
దోమతెర ధరించి.. ఫాగింగ్ మెషిన్‌తో!
ప్రభుత్వ యంత్రాంగం నిద్రమత్తును వదిలించేందుకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒక విలక్షణ మార్గాన్ని ఎంచుకున్నారు. గురువారం ఆయన శాసనసభకు వస్తూ తన వెంట దోమతెరను, ఫాగింగ్ యంత్రాన్ని తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒంటికి దోమతెర చుట్టుకుని, ఫాగింగ్ మెషిన్ పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉత్కంఠ నెలకొంది. నిబంధనల సాకుతో లోపలికి అనుమతించకపోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆయన తన నిరసనను కొనసాగించారు.
కునారిల్లుతున్న నగర ప్రతిష్ఠ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు
* ఆయన లేవనెత్తిన కీలక అంశాలివే:
పడకేసిన పారిశుద్ధ్యం: జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణను విస్మరించారు. నిర్వహణ లోపంతో నగరం అపరిశుభ్రతకు నిలయంగా మారుతోంది.
సత్వర చర్యలే పరిష్కారం:
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు పరుగులెత్తించాలని సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరాన్ని దోమల నుంచి విముక్తి చేయకపోతే.. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, హైదరాబాద్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు మసకబారుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు వెంటనే సమీక్ష నిర్వహించి నిధులు విడుదల చేయాలని కోరారు.
