సలేశ్వరం జాతరలో ‘ప్లాస్టిక్’ వద్దు.
- ప్రకృతిని కాపాడుకుందాం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి.
- ప్రపంచ పర్యావరణ సంస్థ గోడపత్రిక ఆవిష్కరణ.
- నల్లమలలో కాలుష్య నివారణకు భక్తులు సహకరించాలి
హైదరాబాద్:
ప్రకృతి ఒడిలో వెలసిన సలేశ్వరం లింగమయ్య క్షేత్రాన్ని కాలుష్య కోరల నుంచి కాపాడాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అమరనాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో, భక్తులంతా క్రమశిక్షణతో మెలగాలని కోరారు. ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో ‘ప్రపంచ పర్యావరణ సంస్థ’ భేష్
ఇంటికి.. ఒంటికి ప్లాస్టిక్ ముప్పు!
ప్రజల సంపాదనలో 30 శాతం హాస్పిటల్స్ పాలవుతోందని, దీనికి ప్లాస్టిక్ కాలుష్యమే ప్రధాన కారణమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సి.హెచ్. భద్ర ఆందోళన వ్యక్తం చేశారు. “మనం తినే ఆహారం, తాగే నీటి ద్వారా రోజూ 2 నుంచి 4 గ్రాముల ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తోంది. దీన్ని అరికట్టేందుకు స్టీల్ బాటిళ్లు, జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం” అని సంస్థ జాతీయ కార్యదర్శి సాగర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కోటి మందిని చైతన్యపరచడమే తమ లక్ష్యమని వివరించారు.
