ఆర్థిక నేరగాళ్లకు చెక్.. నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పీఎస్ ప్రారంభం

  • ​రూ. 2 కోట్లు దాటిన మోసాలపై నజర్
  • ​రిబ్బన్ కట్ చేసిన మల్కాజిగిరి సీపీ
  • ​స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా కోస్గి భాస్కర్ బాధ్యతలు

ఆర్థిక నేరగాళ్లకు చెక్.. నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పీఎస్ ప్రారంభం

​నేరెడ్‌మెట్
పెరుగుతున్న ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక విభాగం రంగంలోకి దిగింది. నేరెడ్‌మెట్‌లోని సిపిఓ (CPO) ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీస్ స్టేషన్‌ను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. పోలీస్ క్వార్టర్స్ నుంచి తన కార్యకలాపాలను మొదలుపెట్టిన ఈ స్టేషన్‌లో సీపీ స్వయంగా జి.డి (GD) ఎంట్రీ రాసి విధులను ప్రారంభించారు.

​భారీ మోసాలపై ప్రత్యేక నిఘా
​సాధారణ పోలీస్ స్టేషన్లపై పనిభారాన్ని తగ్గించి, సంక్లిష్టమైన ఆర్థిక మూలాలను ఛేదించేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ఈఓడబ్ల్యూ ఫోకస్ పెట్టనుంది:
​కోట్ల రూపాయల స్కామ్‌లు: రూ. 2 కోట్లకు పైబడిన భారీ ఆర్థిక మోసాలు, నమ్మకద్రోహం, ఫోర్జరీ కేసులను ఈ విభాగం దర్యాప్తు చేస్తుంది.
​డిపాజిటర్ల రక్షణ: తెలంగాణ రాష్ట్ర డిపాజిటర్ల రక్షణ చట్టం-1999 (2023 సవరణ) ప్రకారం రూ. 1 కోటి దాటిన డిపాజిట్ మోసాల విచారణను చేపడుతుంది.
​కీలక కేసులు: సీపీ ఆదేశాల మేరకు బదిలీ అయ్యే ఇతర సెన్సేషనల్ ఆర్థిక నేరాలను కూడా ఈ బృందం డీల్ చేస్తుంది.

​అనుభవజ్ఞులతో ప్రత్యేక బృందం
​ఈ విభాగానికి పర్యవేక్షకులుగా రోడ్ సేఫ్టీ డీసీపీ కె. మనోహర్ వ్యవహరిస్తారు. వారికి సహాయకులుగా ఏసీపీలు పి. సత్తయ్య, సి. అంజయ్య ఉంటారు. కాగా, ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా కోస్గి భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ మొన్నటి వరకు ఉప్పల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. వీరితో పాటు ఇన్‌స్పెక్టర్లు ఎ. సూర్య నాయక్, కె. రవి కుమార్ విధుల్లో చేరారు.

​అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేస్తుందని ఈ సందర్భంగా సీపీ పేర్కొన్నారు.WhatsApp Image 2026-04-01 at 20.06.13 (1)

About The Author