చైతన్యంతోనే రాజ్యాధికారం సాధ్యం

  • డబ్బు రాజకీయాలను తిప్పికొట్టాలి
  • ​తెలంగాణలో అధికంగా నష్టపోయింది బీసీలే: ​దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణలో మధుయాష్కి గౌడ్.

చైతన్యంతోనే రాజ్యాధికారం సాధ్యం

​ఎల్బీనగర్:

 డబ్బు, వ్యాపారమయమైన రాజకీయాలను కేవలం రాజకీయ చైతన్యంతోనే తిప్పికొట్టగలమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. ఐక్యత, చైతన్యం ద్వారానే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగగలరని ఆయన పేర్కొన్నారు. కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​పోరాట స్ఫూర్తితో ముందుకు..
​అనంతరం ఎస్కే గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో మధుయాష్కి మాట్లాడుతూ.. నిజాం అరాచక పాలన, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో బహుజనులు రాజకీయంగా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. "ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయింది. దానిని తట్టుకునే ఆర్థిక స్తోమత బీసీలకు లేదు. అందుకే కేవలం చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధించుకోవాలి" అని సూచించారు.

​పదేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం
​తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయి, అన్ని రకాలుగా నష్టపోయింది బీసీలేనని యాష్కి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చాక కూడా బీసీలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. "గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు గొర్రెలు, బండ్లు ఇచ్చి సరిపెట్టారు. పాలకులు మాత్రం వేల కోట్లు దోచుకున్నారు. చైతన్యం లేకపోవడం వల్లే బీసీలు ఎన్నికల్లో నిలబడితే గెలిపించుకోలేని పరిస్థితులు ఉన్నాయి" అని విమర్శించారు.

​కుల సంఘాల్లోని దోపిడీదారులను గుర్తించాలి
​కుల సంఘాల్లో ఉండే దోపిడీదారులను గుర్తించి పక్కన పెట్టినప్పుడే సంఘం, కులం బలపడతాయని మధుయాష్కి పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కల్లు దుకాణాలను బంద్ చేస్తే, తాను నిజాం కాలేజీలో సభ పెట్టి పోరాడానని గుర్తుచేశారు. కుల సంఘాల భవనాలను ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాపార ధోరణిని ప్రతినిధులు చైతన్యంతో అడ్డుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ కురుమ, ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లేష్ కురుమ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, నాయకులు రవికుమార్, గౌడ్ రాజకుమార్, రావుల ఐలయ్య, పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, బుడ్డ సత్యనారాయణ, వేణుగోపాల్ యాదవ్, రేణు గౌడ్, శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author