బల్దియాలో ‘రాంకీ’ దోపిడీ.. పారిశుద్ధ్యం పేరుతో ప్రజాధనం స్వాహా!
- 15 ఏళ్లుగా ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం.. చూసీచూడనట్లు వదిలేస్తున్న అధికారులు!
- జీహెచ్‌ఎంసీలో అవుట్‌సోర్సింగ్ ‘గోల్‌మాల్’!
- సొంత సిబ్బంది ఉన్నా ప్రైవేటు సంస్థలకే పెద్దపీట..
- డూప్లికేషన్ పనులతో ఖజానాకు భారీ గండి?
- మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రత్యేక అధికారి జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో పారిశుద్ధ్యం పేరుతో ‘రాంకీ’ వంటి ప్రైవేటు సంస్థల దోపిడీ పర్వం కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా సాగుతున్న ఈ అద్దె కాపురంలో, సొంత ఇంటిని (GHMC సిబ్బందిని) అధికారులు గాలికొదిలేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ధారపోస్తూ, మళ్ళీ అదే పనికి శానిటరీ జవాన్లు, కామటీలను క్షేత్రస్థాయిలో నియమించడం అధికారుల ‘రెట్టింపు’ తెలివితేటలకు నిదర్శనం. సొంత సిబ్బందికి వాహనాలు ఇవ్వని ఉదారత, ప్రైవేటు సంస్థల అద్దె వాహనాలకు మాత్రం బిల్లులు చెల్లించడంలో కనిపిస్తోంది. పని మున్సిపల్ కార్మికుడిది.. బిల్లు మాత్రం రాంకీది అన్నట్లుగా సాగుతున్న ఈ ‘శానిటరీ’ దందాలో, అసలైన మురికి ఎక్కడ ఉందో అధికారులకే ఎరుక. 
హైదరాబాద్ -:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో శానిటేషన్ విభాగం తీరు తెన్నులపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి ప్రైవేటు ఏజెన్సీలకు పనులు అప్పగిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన రీతిలో ఉండటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 'రామ్కీ', 'ఇక్సోరా' వంటి ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం పెరిగిపోవడంపై భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ (BMS) గళమెత్తింది.
గత 15 ఏళ్లుగా శానిటేషన్ పనులను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెడుతున్నా, వ్యవస్థలో ఎటువంటి మార్పు రాకపోగా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారుల నిర్వహణను ఇక్సోరా కంపెనీకి, కాలనీల స్థాయి పారిశుద్ధ్యాన్ని రామ్కీ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం, మరి జి.హెచ్.ఎం.సికి చెందిన సొంత శానిటరీ జవాన్లు, కామటీలను క్షేత్రస్థాయిలో ఎందుకు వినియోగిస్తోందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే పనికి అటు ప్రైవేటు సంస్థలకు బిల్లులు చెల్లిస్తూ, ఇటు ప్రభుత్వ సిబ్బందిని వాడటం వల్ల ‘డూప్లికేషన్’ జరిగి ఖజానాపై మోయలేని భారం పడుతోంది.
ప్రైవేటు ఏజెన్సీల పనితీరును పర్యవేక్షించడంలో కొందరు అధికారులు విఫలమవుతున్నారని, వారి మధ్య అనధికారిక ఒప్పందాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్వహించాల్సిన విధులను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడమేంటని సిబ్బంది మండిపడుతున్నారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా (SFA) ప్రైవేటు వ్యక్తులను నియమించడం వల్ల జవాబుదారీతనం లోపిస్తోందని విమర్శలు ఉన్నాయి.
ముఖ్య డిమాండ్లు ఇవే:
పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ ఈ క్రింది అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు:
* ఒప్పందాల సమీక్ష: రామ్కీ, ఇక్సోరా వంటి సంస్థలతో ఉన్న అగ్రిమెంట్లను తక్షణమే సమీక్షించి, అనవసరమైన వాటిని రద్దు చేయాలి.
* సొంత సిబ్బంది వినియోగం: శానిటరీ జవాన్లు, కామటీలకు తగిన విధులను కేటాయించి, ప్రైవేటు ఏజెన్సీల జోక్యం తగ్గించాలి.
* వనరుల కల్పన: ఇన్-హౌస్ స్టాఫ్ కు అవసరమైన వాహనాలు (Guzzars), ఇతర పరికరాలను సమకూర్చడం ద్వారా సామర్థ్యాన్ని పెంచాలి.
* పర్యవేక్షణ: ప్రైవేటు SFAల బదులు ప్రభుత్వ శానిటరీ జవాన్ల పర్యవేక్షణలోనే పనులు జరగాలి.
సొంతంగా భారీ యంత్రాంగం, సిబ్బంది ఉన్నప్పటికీ ప్రైవేటు సంస్థలపై ఈ మితిమీరిన ఆధారపడటం వెనుక అంతర్యం ఏమిటో విచారణ జరిపించాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. మరి ఈ వ్యవహారంపై స్పెషల్ ఆఫీసర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
