భైంసా ఆన్‌లైన్ బస్‌పాస్ కౌంటర్‌లో అవ్యవస్థలు
విద్యార్థులు, జర్నలిస్టులకు అన్యాయం – అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు*
ఆదిలాబాద్:
భైంసా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) భైంసా డిపో పరిధిలోని ఆన్‌లైన్ బస్‌పాస్ కౌంటర్‌లో నెలకొన్న అవ్యవస్థలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. గత సంవత్సరం నుండి కౌంటర్‌లో ఉన్న లామినేషన్ మెషిన్, కలర్ ప్రింటర్ సరిగా పని చేయకపోవడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు మరియు జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం కౌంటర్‌లో కేవలం బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్‌తోనే బస్‌పాస్‌లు జారీ చేస్తుండటంతో, ఆన్‌లైన్ సౌకర్యం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్‌పాస్ కోసం వచ్చే విద్యార్థులు, జర్నలిస్టుల నుంచి మాత్రం పూర్తి రుసుము వసూలు చేస్తుండటం అన్యాయమని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేకంగా జర్నలిస్టు బస్‌పాస్‌కు ₹50 రుసుము వసూలు చేసి, కలర్ ప్రింట్‌తో పాటు లామినేషన్ చేసి ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఆ సదుపాయం లేకుండా నాసిరకం పాస్‌లు అందజేస్తుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి విద్యార్థుల పాస్‌ల విషయంలోనూ కొనసాగుతోందని వారు చెబుతున్నారు.
అంతా తెలిసి కూడా అధికారులు పట్టించుకోకపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది నుంచి సమస్య కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం ఆశ్చర్యకరమని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆన్‌లైన్ వ్యవస్థ పేరుతో జాప్యం, సాంకేతిక లోపాలు కొనసాగుతుండటంతో ప్రయోజనం లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ విషయంపై భైంసా డిపో మేనేజర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జర్నలిస్టులు, విద్యార్థులు కోరుతున్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా వెంటనే కలర్ ప్రింటర్, లామినేషన్ మెషిన్ మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో సేవలు అందించాలి అని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, భైంసా ఆన్‌లైన్ బస్‌పాస్ కౌంటర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
