ప్రజా పాలన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  • అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్మయి ఆదేశం
  • సమగ్ర నివేదికలు, స్టాళ్లతో సిద్ధం కావాలని పిలుపు

ప్రజా పాలన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రంగారెడ్డి జిల్లా : 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం (ఈ నెల 22న) నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కిరణ్మయి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె సంబంధిత అధికారులతో దూరవాణి సదస్సు (టెలీ కాన్ఫరెన్స్) నిర్వహించి, ఏర్పాట్లపై ముమ్మర సమీక్ష జరిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు.

*విజయవంతం చేయడమే లక్ష్యం..
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ప్రజాపాలన కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రగతి నివేదికలు సిద్ధం చేయండి
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ఛాయాచిత్రాలు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, సాధించిన పురోగతిని సమగ్రంగా వివరించేలా ‘సంగణక దృశ్య ప్రదర్శన’ (పవర్ పాయింట్ ప్రజెంటేషన్) కోసం నివేదికలను సమర్పించాలన్నారు.

స్టాళ్ల ఏర్పాటు.. 
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని కిరణ్మయి సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా స్థాయి ప్రజా పాలన కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

About The Author