*రాక్‌టౌన్‌ కాలనీలో తాగునీటి ఎద్దడి తీర్చాలి.

*హయత్‌నగర్‌ జోన్‌ సీజీఎం నాగేంద్ర కుమార్‌కు కాలనీ అసోసియేషన్ వినతి

*రాక్‌టౌన్‌ కాలనీలో తాగునీటి ఎద్దడి తీర్చాలి.

ఎల్బీనగర్:

ఉమ్మడి నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీలో గత కొద్దిరోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా సాగడం లేదు. కృష్ణా జలాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, దీనివల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని వారు పేర్కొన్నారు.

*సీ.జీ.ఎం కు వినతిపత్రం సమర్పణ:
ఇటీవలే హయత్‌నగర్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా బాధ్యతలు స్వీకరించిన నాగేంద్ర కుమార్‌ను రాక్‌టౌన్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. అనంతరం కాలనీలో ఎదుర్కొంటున్న ప్రధాన తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర వినోద్ రెడ్డి, కార్యదర్శి నాగవెల్లి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*తక్షణమే తనిఖీ చేయాలని ఆదేశం.
తాగునీటి సమస్యపై సీజీఎం నాగేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం అందుకున్న వెంటనే ఆయన సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. నీటి సరఫరా జరిగే సమయంలో స్వయంగా మేనేజర్ వెళ్లి పరిశీలించాలని, ఎక్కడ లోపం ఉందో గుర్తించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీజీఎం స్పందన పట్ల కాలనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

About The Author