జనగణనతోనే సంక్షేమ ఫలాలు: డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య
- బడంగ్‌పేట్ సర్కిల్-16లో ముమ్మరంగా సాగుతున్న జనాభా లెక్కల సేకరణ
- క్షేత్రస్థాయిలో పరిశీలించిన పురపాలక అధికారి
- తప్పుడు సమాచారం ఇవ్వొద్దు.. ప్రజలకు విజ్ఞప్తి
బడంగ్‌పేట్:
దేశాభివృద్ధికి, భవిష్యత్ సంక్షేమ పథకాల రూపకల్పనకు జనాభా లెక్కల సేకరణ (జనగణన) అత్యంత కీలకమని బడంగ్‌పేట్ పురపాలక సంఘం సర్కిల్-16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య తెలిపారు. సర్కిల్ పరిధిలో సాగుతున్న జనగణన ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. కుర్మల్‌గూడ ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్న గణన సిబ్బంది, పర్యవేక్షకుల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.
*సిబ్బందికి కీలక ఆదేశాలు
విధుల నిర్వహణలో సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. సమాచార సేకరణ పురోగతి, ప్రజల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలపై సిబ్బందితో ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఏ ఒక్క ఇల్లు, ఏ ఒక్కరి సమాచారం విస్మరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సేకరించే సమాచారంలో నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
*వి. సమ్మయ్య, డిప్యూటీ కమిషనర్.
*ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో డిప్యూటీ కమిషనర్ మాట్లాడారు. విద్య, ఉపాధి, ఆర్థిక, నివాస పరిస్థితుల ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తుందని వివరించారు. అర్హులకు ఫలాలు అందాలంటే ప్రతి కుటుంబం ఖచ్చితమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించాలని కోరారు.
తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, పారిశుధ్యం వంటి రంగాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఈ గణాంకాలే దిక్సూచి అని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా, పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో పురపాలక అధికారులు, పర్యవేక్షకులు, గణన సిబ్బంది, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.
