మహిళా సంక్షేమానికి మరో అడుగు.. మహిళా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మహిళలకు ఆర్థిక, సామాజిక పరంగా మరింత బలాన్ని చేకూర్చేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు.మహిళా భవనం ద్వారా స్థానిక మహిళలకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు మరియు వివిధ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం తగిన చొరవ చూపడం లేదని విమర్శించారు. పేదలు, కార్మికులు, మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలు అమలు కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రజలకు న్యాయం జరిగేలా మంచి పాలన అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తప్పుడు వాగ్దానాలతో కాలం వెళ్ళబుచుతున్నారని ఆమె పేర్కొన్నారు. అలాగే రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గతంలో పలు చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. మొదట్లో కొన్ని అభివృద్ధి పనులు ప్రజలకు అర్థం కాలేదని, కానీ తరువాత వాటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపించాయని అన్నారు. చిన్న రోడ్లను విస్తరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావించామని, అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ జామ్ సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని అమలుపరిచే అంత వరకు ప్రజల పక్షాన పోరాడుతామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు
