ఐకేపీ వీఓఏల సమ్మెకు సంపూర్ణ మద్దతు

  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
  • జూన్ 2లోపు సమస్యలు పరిష్కరించకపోతే దీర్ఘకాల ఉద్యమం తప్పదు 
  • వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీస్ నాయకులు 

ఐకేపీ వీఓఏల సమ్మెకు సంపూర్ణ మద్దతు

వికారాబాద్:

వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో కొనసాగుతున్న ఐకేపీ వీఓఏల సమ్మెకు గురువారం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన వారు వీఓఏల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఐకేపీ వీఓఏలకు రూ.20 వేల వేతనం అందిస్తామని, అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పిస్తామని, అదనపు పనిభారాలు తగ్గిస్తామని అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జాబ్ చార్ట్‌లో లేని పనులను వీఓఏలతో చేయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళా సంఘాలు నిర్వహించాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలను పూర్తిగా వీఓఏలపై మోపుతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో రాజకీయ నాయకుల జోక్యం అధికమైందని, వారు చేసే తప్పిదాలకు వీఓఏలను బలి పశువులుగా మార్చుతున్నారని విమర్శించారు.

గ్రామ సంఘాలకు రావాల్సిన ఆదాయాన్ని సైతం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించిన నాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు చేస్తున్న పెత్తందారీ అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఒకవైపు ప్రభుత్వం అదనపు పనిభారాలతో వీఓఏలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు జిల్లా స్థాయి అధికార యంత్రాంగం వేధింపులు కూడా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుల పెత్తందారీతనాన్ని అడ్డుకోలేని అధికారులు వీఓఏలను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే 78 రకాల పనులు, 14 రకాల యాప్‌లతో వీఓఏలు వెట్టి చాకిరీ చేస్తున్నారని మండిపడ్డారు.

జూన్ 2లోపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఓఏల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, వీఓఏ సంఘం మండల అధ్యక్షురాలు ముంతాజ్, ఉపాధ్యక్షుడు హరీష్, కార్యదర్శి శ్యామల, కోశాధికారి శ్రీనివాస్, సలహాదారు శాఖప్ప, వెంకటయ్య, రాములు, శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-21 at 19.50.27

About The Author