బీటీ-3’ గుట్టురట్టు.. 600 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్!
- నంద్యాల ముఠాను పట్టుకున్న రాచకొండ ఎస్ఓటీ.. నలుగురు అరెస్ట్
- *కారు, బొలెరో వాహనాలతో పాటు మొబైల్స్ స్వాధీనం.
హయాత్‌నగర్:
తెలంగాణలో సాగు సీజన్ ప్రారంభాన్ని ఆసరాగా చేసుకుని అమాయక రైతులను ముంచేందుకు పొరుగు రాష్ట్రం నుంచి తరలిస్తున్న భారీ నకిలీ విత్తనాల ముఠాను రాచకొండ పోలీసులు చేధించారు. నిషేధిత, నకిలీ బీటీ-3 (BT-3) పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ (SOT), హయాత్‌నగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. లక్షల విలువైన 600 కిలోల నకిలీ విత్తనాలతో పాటు రెండు వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హయాత్‌నగర్ పీఎస్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 852/2026 ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
*పిస్తా హౌస్ సమీపంలో మెరుపు దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నుంచి హయాత్‌నగర్ మీదుగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పెద్దఅంబర్‌పేటలోని పిస్తా హౌస్ హోటల్ సమీపంలో నిఘా పెట్టి, నిందితులు ప్రయాణిస్తున్న టాటా నెక్సాన్ కార్ (AP39-GQ-5883), మహీంద్రా బొలెరో (AP21-TA-0836) వాహనాలను అడ్డుకున్నారు. బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా.. 10 గోనె సంచులలో దాచిన సుమారు 600 కేజీల లూజ్ నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలు బయటపడ్డాయి.
పట్టుబడిన నిందితులంతా ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందినవారు:
*చలివెందుల రాజారామ్ (42): డొమ్మిపాడు (గతంలో విత్తనాల వ్యాపారి),
గోస స్వామిదాసు (48):పెద్ద కంబలూరు (ఈయనపై గతంలోనూ నకిలీ విత్తనాల కేసు ఉంది)
*అనుముల మల్లేశ్వరయ్య (28): నల్లగట్ల (నెక్సాన్ కారుతో పైలటింగ్ చేశాడు)
*కందాల చిన్న ఓబులేసు (45): చింతకుంట (బొలెరో డ్రైవర్)
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి అంటూ మోసం
"తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది" అని నమ్మించి, ఎలాంటి బిల్లులు, లైసెన్సులు లేకుండా ఈ నకిలీ విత్తనాలను విక్రయించేందుకు తెచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇటువంటి ప్రమాదకర విత్తనాల వల్ల మొలక శాతం దెబ్బతిని పంట పూర్తిగా విఫలమవడమే కాకుండా, భూమి నిస్సారమై రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
*ఉక్కుపాదం మోపుతాం: మల్కాజ్‌గిరి పోలీస్
రైతుల పొట్టగొట్టే నకిలీ విత్తనాల సప్లై చైన్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని పోలీసులు హెచ్చరించారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4)తో పాటు ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, సీడ్స్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేశారు. మల్కాజ్‌గిరి సిపి *శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్* ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. గ్రామాల్లో నకిలీ విత్తనాల రవాణా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాచకొండ కమిషనరేట్ కోరింది.
