ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం

  • - గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి
  • - బీజీ వెంకటాపూర్ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాల వికాస్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, ముఖ్య నాయకులతో ఆదర్శ గ్రామ నిర్మాణంపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బాల వికాస్ సంస్థ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలోని ప్రతి వీధి నుంచి ప్రజలు ఈ పథకంలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరు గ్రామసభకు హాజరయ్యేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు.గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నిర్వహించే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆదర్శ గ్రామ నిర్మాణ పథకం మేనేజర్ మంజుల మాట్లాడుతూ, బాల వికాస్ సంస్థ గత 40 సంవత్సరాలుగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తోందన్నారు. గ్రామాల్లో స్థిరమైన మార్పు రావాలంటే నాయకులు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ బాబు, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యులు, బాల వికాస్ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ రమేష్, డెవలప్మెంట్ ఏజెంట్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About The Author