వన్యప్రాణుల సంరక్షణలో భారత్‌కు ప్రపంచ గుర్తింపు
- జీవవైవిధ్య పరిరక్షణ మనందరి బాధ్యత: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జూ పార్కులో ‘షేర్డ్ స్ట్రైప్స్ - షేర్డ్ ఫ్యూచర్’ వర్క్ షాప్ ప్రారంభం
హైదరాబాద్:
వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విడదీయలేని భాగమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పులులు, చిరుతలు, ఆసియా సింహాలు వంటి పెద్ద పులి జాతుల సంరక్షణలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్’ (IBCA) రెండు రోజుల వర్క్ షాప్‌ను ఆయన ప్రారంభించారు. ‘షేర్డ్ స్ట్రైప్స్ - షేర్డ్ ఫ్యూచర్’ థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రకృతితోనే నాగరికత..
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రకృతి, వన్యప్రాణుల పట్ల గౌరవం, సహజీవనం అనేది భారతీయ జీవన విధానంలోనే ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కేవలం పర్యావరణ బాధ్యత మాత్రమే కాదని, అది మన నాగరికతకు ప్రతీక అని పేర్కొన్నారు. నెహ్రూ జూ పార్క్ దేశంలోనే అత్యుత్తమ జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా నిలిచిందని, అరుదైన జాతుల సంతానోత్పత్తి, ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఈ పార్క్ కీలకంగా వ్యవహరిస్తోందని కొనియాడారు.
గ్లోబల్ రోల్ మోడల్
భారత్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ (IBCA) ద్వారా ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు, అనుభవాలను పంచుకునే అవకాశం కలిగిందని గవర్నర్ తెలిపారు. భారత్ అనుసరిస్తున్న విధానాలు ఆసియా, ఆఫ్రికా దేశాలకు స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ వంటి పులి సంరక్షణ కేంద్రాలు రాష్ట్ర జీవవైవిధ్యానికి నిలువుటద్దాలని, అడవుల పెంపకంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పర్యావరణ సమతుల్యత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అనంతరం గవర్నర్ జూ పార్కులో సఫారీని సందర్శించి పెద్ద పులులు, ఇతర జంతువులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన అటవీ జంతువుల చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, పీసీసీఎఫ్ సువర్ణ, వినయ్ కుమార్, ఎఫ్డీసీ ఎండీ సునీత భగవత్, రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ మరియు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
