పంట మార్చితే ప్రభుత్వం రైతులకు గోసే మిగిల్చింది

  • - మిరుదొడ్డి మార్కెట్‌లో ధాన్యం కొనక రైతులకు ఇక్కట్లు 
  • - కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి
  • - స్పందించకపోతే వంటావార్పుతో నిరసన హెచ్చరిక
  • - బీఆర్ఎస్ నేత తోట కమలాకర్ రెడ్డి

పంట మార్చితే ప్రభుత్వం రైతులకు గోసే మిగిల్చింది

సిద్దిపేట:

రైతులు పంట మార్చితే  కాంగ్రెస్  ప్రభుత్వం వారికీ గోస మిగిల్చిందని, వెంటనే కొనుగోళ్లు  ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు.  శుక్రవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్‌లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కాక మార్కెట్ యార్డులోనే నిల్వ ఉండిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి  మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన మేరకు రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారని, ఇప్పుడు కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా లేవని, ధాన్యాన్ని కప్పేందుకు పాలిథిన్ కవర్లు సైతం అందించడం లేదని అధికారులపై మండిపడ్డారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం గోసనే మిగిల్చిందని విమర్శించారు.వెంటనే లారీల ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే సోమవారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
రైతుల ఆందోళనలను అణచివేయడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తే సహించబోమని స్పష్టం చేశారు. రైతు కష్టాన్ని పట్టించుకోని ఈ ప్రభుత్వానికి అన్నదాతల ఆవేదన తప్పదని, అధికారంలోకి వచ్చి రైతులను గాలికొదిలేసిందని తోట కమలాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు ఉన్నారు.WhatsApp Image 2026-05-08 at 19.35.36 (1)

About The Author