దుర్గం చెరువుకు ‘మురుగు’ ఉచ్చు!

  • ​హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం.. క్షేత్రస్థాయిలో పరిశీలన
  • ​సమన్వయ లోపంపై అధికారులకి చురకలు.. ప్రక్షాళనకు సత్వర చర్యలు..

దుర్గం చెరువుకు ‘మురుగు’ ఉచ్చు!

హైదరాబాద్‌: 

ఐటీ హబ్‌కు మణిహారంగా నిలిచే మాదాపూర్‌లోని దుర్గం చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంపై హైడ్రా (HYDRAA) తీవ్రంగా స్పందించింది. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేరుతుండటం, గుర్రపుడెక్క విస్తరించి దుర్గంధం వెదజల్లడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మీడియా కథనాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువు దుస్థితిని చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
​మురుగు నీరు నేరుగా చెరువులోకా?
​పర్యటన సందర్భంగా చెరువులో సగానికి పైగా గుర్రపుడెక్క పరుచుకుని ఉండటాన్ని కమిషనర్ గమనించారు. మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (STP) అందుబాటులో ఉన్నప్పటికీ, వరద కాలువల ద్వారా మురుగు నీటిని నేరుగా చెరువులోకి వదలడంపై అధికారులను నిలదీశారు. ఎస్టీపీల సామర్థ్యం మించి మురుగు వస్తోందని ఇరిగేషన్ ఇంజినీర్లు చెప్పిన సమాధానంపై ఆయన మండిపడ్డారు. "అదనపు మురుగు వస్తే డ్రైనేజీ కాలువలకు మళ్లించాలి తప్ప, నేరుగా చెరువులోకి వదిలి కలుషితం చేయడం ఏంటి?" అని ప్రశ్నించారు. ఒకవైపు శుద్ధి చేసిన నీటిని వదులుతూ, మరోవైపు నేరుగా మురుగును కలపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు.
​అధికారుల మధ్య ‘సమన్వయ’ లేమి
​చెరువు అభివృద్ధి అంటే కేవలం పైపై మెరుగులు దిద్దడం కాదని, కాలుష్య నివారణే ప్రధానమని కమిషనర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖలతో పాటు ర హేజా మైండ్‌స్పేస్, రాంకీ సంస్థల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎస్టీపీల నుంచి వస్తున్న నీటి నమూనాలను తక్షణమే సేకరించి పరీక్షల నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి (PCB) కి పంపాలని అధికారులను ఆదేశించారు.

​ప్రక్షాళనకు కార్యాచరణ..

​క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం హైడ్రా కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో కమిషనర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రక్షాళన పనులకు ఉన్న అడ్డంకులను తొలగించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు:
​ట్రాఫిక్ మళ్లింపు: పైపులైన్ డైవర్షన్ పనుల కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ గారితో మాట్లాడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేశారు.

​డైవర్షన్ కాలువ: ఇన్ ఆర్బిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ వంటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి రాకుండా, పడమర వైపు ప్రత్యేక కాలువ తవ్వేలా చర్యలు తీసుకోవాలని రహేజా సంస్థ ప్రతినిధులకు సూచించారు.

​యుద్ధ ప్రాతిపదికన పనులు: జలమండలి, విద్యుత్, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పని చేసి చెరువులోకి మురుగు నీటి చేరికను తక్షణమే అడ్డుకోవాలని ఆదేశించారు.

​భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే క్రమంలో దుర్గం చెరువు పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

About The Author