నిబంధనలు 'తుంగలో'.. అక్రమాలు 'చెరువులో'!

  • హయత్ నగర్ 'బాతుల చెరువు' శిఖం భూముల్లో 10ల సంఖ్యలో అక్రమ నిర్మాణాల జోరు.
  • నివాస అనుమతులతో కమర్షియల్ దందా.. అధికారుల అండదండలతోనే 'అవినీతి' అడుగులు?
  • బిల్డ్ నౌ వెబ్సైట్లో పారదర్శకత లేకపోవడంతో పేట్రేగిపోతున్న అధికారులు..

నిబంధనలు 'తుంగలో'.. అక్రమాలు 'చెరువులో'!

హయత్ నగర్:

చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది పాత మాట.. ఇక్కడ అక్రమార్కులు తమ పని తాము చేసుకుపోతుంటే, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హయత్ నగర్ డివిజన్‌లోని బాతుల చెరువు కట్ట కింద జరుగుతున్న వ్యవహారం మున్సిపల్ నిబంధనలకు పాతర వేస్తోంది. చెరువు శిఖం (FTL), బఫర్ జోన్లను మింగేస్తూ వెలుస్తున్న అక్రమ కట్టడాలు జీహెచ్‌ఎంసీ ఆదాయానికి భారీ గండి కొడుతుండగా, టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు.

అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి!

హయత్ నగర్ జి స్కూల్ ప్రక్కనుండి మునగనూర్ ప్రధాన రహదారిని ఆనుకుని సుమారు కిలోమీటర్ మేర వెలుస్తున్న భవనాలన్నీ అక్రమాల పుట్టలేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైల్ నంబర్: 032902/GHMC/08157/IABP/C3/2025 పరిధిలోని ప్లాట్ నంబర్ 62/A (సర్వే నంబర్లు: 306-309)లో నివాస గృహం (Residential) కోసం అనుమతి పొంది, నిబంధనలకు విరుద్ధంగా భారీ కమర్షియల్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 137.12 చదరపు మీటర్ల స్థలంలో  వాణిజ్య సముదాయాలు నిర్మించడం వెనుక అధికారుల 'మామూళ్ల' పర్వం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

దళారీ వ్యవస్థదే పైచేయి..

బాతుల చెరువు కట్ట కింద ఉన్న స్థలాల యజమానులను భయపెట్టి, "ఇది ఎఫ్.టి.ఎల్ ప్రాంతం.. నేను చూసుకుంటాను" అంటూ రంగంలోకి దిగుతున్న ఓ దళారీ, లీజు అగ్రిమెంట్ల పేరుతో అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ, అడిగిన వారిని బెదిరిస్తూ ఈ 'అవినీతి సామ్రాజ్యాన్ని' విస్తరిస్తున్నాడని సమాచారం. సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ నింపడం వల్ల భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు జరిగితే ప్రాణనష్టానికి బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

నోటీసులతో అధికారుల కాలయాపన:

అక్రమ కట్టడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందితే, క్షేత్రస్థాయి అధికారులు కేవలం 'నోటీసులు ఇచ్చాం' అని నివేదికలు పంపి చేతులు దులుపుకుంటున్నారు. టీపీఎస్ సోమేష్ కుమార్,ఏసీపీ విజయలక్ష్మి, డీసీ వంశీకృష్ణ వంటి అధికారులు ఈ అక్రమాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇక్కడ ఉన్న 'లేక్ వే కాఫీ షాప్'తో పాటు అనేక వాణిజ్య సముదాయాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలను బేఖాతరు చేస్తున్నా, టౌన్ ప్లానింగ్ విభాగం మౌనం వహించడం వెనుక అంతర్యమేమిటి?

'హైడ్రా' కన్ను పడాల్సిందే!

హైదరాబాద్‌లోని చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న 'హైడ్రా' (HYDRAA) కమిషనర్ రంగనాథ్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

 * నివాస అనుమతులతో కమర్షియల్ వ్యాపారాలు చేస్తున్న భవనాలను వెంటనే సీజ్ చేయాలి.

 * అక్రమ నిర్మాణాలకు సహకరించిన హయత్ నగర్ సర్కిల్ అధికారులపై విచారణ జరిపించాలి.

 * జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ లు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి.
చెరువు కట్ట కింద ఉన్న మృత్యుకూపాలను 'వసుమోటో'గా తీసుకుని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భారీ ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

బిల్డ్ నౌ’లో పారదర్శకత నిల్‌.. అవినీతికి అది ‘అధికారుల’ స్వర్గధామం!

​ప్రజల చెంతకు పాలనను చేరువ చేయాల్సిన 'బిల్డ్ నౌ' వెబ్‌సైట్, ప్రస్తుతం అక్రమార్కులకు వరప్రసాదంగా మారింది. సిటిజన్ సెర్చ్‌లో కీలక సమాచారాన్ని మాయం చేస్తూ, అనుమతులు ఇచ్చే అధికారుల వివరాలను గోప్యంగా ఉంచుతూ టౌన్ ప్లానింగ్ విభాగం భారీ వసూళ్లకు తెరలేపింది. నిషేధిత భూములను సైతం కాసుల కక్కుర్తితో అనుమతుల జాబితాలోకి చేర్చి, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని కాలరాస్తున్నారు. పారదర్శకత లోపించడమే పెట్టుబడిగా సామాన్యుల కళ్ళుగప్పి అవినీతి చిట్టాను వెతకలేనంతగా వెబ్‌సైట్‌ను రూపొందించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులే దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లు వ్యవహరిస్తూ, అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు.WhatsApp Image 2026-02-05 at 16.29.47WhatsApp Image 2026-02-05 at 16.31.15WhatsApp Image 2026-02-05 at 16.31.15 (2)WhatsApp Image 2026-02-05 at 16.29.07WhatsApp Image 2026-02-05 at 16.31.15 (1)

About The Author