లబ్ధిదారులు ఉండకపోతే ఇండ్లు రద్దు
- వెంటనే నివాసం ఉండాల్సిందే
- కొత్త వారికి కేటాయించాలని కలెక్టర్ ఆదేశం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతం
రంగారెడ్డి:
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే వాటిలోకి చేరాలని, లేనిపక్షంలో కేటాయింపులను రద్దు చేస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి హౌసింగ్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.
నివాసం లేకుంటే నోటీసులు
జిల్లాలో ఇప్పటికే పూర్తయిన మరియు నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అర్హులకు కేటాయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతంలో ఇండ్లు పొంది, ఇప్పటికీ అక్కడ నివసించని వారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసుల తర్వాత కూడా నివాసం ఉండని వారి పట్టాలను రద్దు చేసి, ఆ ఇండ్లను కొత్త వారికి కేటాయించాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు.
ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్-2 (L2) జాబితా నుంచి అత్యంత పేదవారిని ఎంపిక చేసి ఇండ్లు కేటాయించాలని ఆర్డీఓలు, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ డి. చాంప్లా నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
.jpeg)
