మహిళా బ్లూ కోల్ట్స్ పోలీసుల సేవలు ప్రారంభం
కరీంనగర్
లాంఛనంగా ప్రారంభించిన సిపి గౌస్ అలం

మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచే ముఖ్య ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో, పోలీసు కమీషనర్ జెండా ఊపి బ్లూ కోల్ట్స్ విధులను కరీంనగర్ పోలీస్ కమిషన్ గౌస్ అలం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎంపిక చేసిన మహిళా పోలీసులకు ప్రభుత్వ స్కూటీలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకంగా మారుతోందని తెలిపారు. వీరు బ్లూ కోల్ట్స్ సేవల్లో భాగస్వామ్యం కావడం ద్వారా, వారు బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడం వంటి విధులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా త్వరలోనే అన్ని ప్రాంతాలలో మహిళా బ్లూ కోల్ట్స్ పోలీసుల సేవలు అందుబాటులోకి రానున్నాయని సీపీ వెల్లడించారు. మహిళల భద్రతకు, ప్రజలకు మరింత చేరువగా పోలీసులు ఉండటానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
