ప్రొఫెసర్‌ కాసింపై కేసుల కొట్టివేత.

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ప్రొఫెసర్‌ కాసింపై కేసుల కొట్టివేత.

హైదరాబాద్:
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాసింపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ తుకారాం ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సెక్షన్ 195 CrPC ప్రకారం నిర్దేశించిన నిబంధనలను పాటించకుండా నమోదు చేసిన కేసులు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని న్యాయస్థానం స్పష్టం చేసింది.

​కేసు నేపథ్యం ఇదీ..
​గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నాలు, నిరసనలపై రిజిస్ట్రార్ నిషేధాజ్ఞలు జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాలను ఉల్లంఘించి ధర్నా నిర్వహించారనే ఆరోపణలపై ప్రొఫెసర్ కాసింపై ఐపీసీ సెక్షన్ 188 (ప్రభుత్వ ఉద్యోగి ఆదేశాల ఉల్లంఘన) కింద పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ కాసిం హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.

​వాదనలు - తీర్పు
​పిటిషనర్ తరపున న్యాయవాది టి. రాహుల్ వాదనలు వినిపిస్తూ.. "సెక్షన్ 188 కింద కేసు నమోదు చేయాలంటే సెక్షన్ 195 CrPC ప్రకారం సంబంధిత ప్రభుత్వ అధికారి (రిజిస్ట్రార్) నేరుగా మేజిస్ట్రేట్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేయాలి. కానీ ఇక్కడ పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టవిరుద్ధం" అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
​ఈ వాదనలతో ఏకీభవించిన గౌరవ న్యాయమూర్తి.. చట్టం నిర్దేశించిన పద్ధతిలో ఫిర్యాదు అందలేదని పేర్కొంటూ, ప్రొఫెసర్ కాసింపై ఉన్న క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. చట్టబద్ధమైన విధానపరమైన రక్షణలు ఉన్నప్పుడు వాటిని అతిక్రమించి ప్రాసిక్యూషన్ కొనసాగించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది.

About The Author