గౌడ సర్పంచులకు ఘన సన్మానం..

రవీంద్రభారతిలో అట్టహాసంగా కార్యక్రమం.. ముఖ్యఅతిథిగా నటుడు సుమన్

గౌడ సర్పంచులకు ఘన సన్మానం..

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన గౌడ కులస్తులైన సర్పంచులను ఉద్దేశించి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సినీ నటుడు సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2100 మంది గౌడ సర్పంచులు ఎన్నికవ్వడం హర్షణీయమని వక్తలు కొనియాడారు.

​రాజ్యాధికారమే లక్ష్యం కావాలి: జైహింద్ గౌడ్

​ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ.. "ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందని" పేర్కొన్నారు. 375 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన వీరనారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూనే, స్వకుల బాంధవుల శ్రేయస్సు కోసం సర్పంచులు కృషి చేయాలని కోరారు.

​గౌడ వృత్తిదారులకు బాసట:

​కులవృత్తిపై ఆధారపడి జీవిస్తూ తాటి చెట్టుపై నుండి పడి ప్రమాదానికి గురైన గీత కార్మికులకు తమ సుప్రజా హాస్పిటల్ ద్వారా ఇప్పటి వరకు రూ. 2 కోట్ల వ్యయంతో ఉచిత వైద్యం అందించామని చైర్మన్ వెల్లడించారు. బాధితులకు అండగా ఉండటమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.


​ఈ సన్మాన సభలో హాజరైన ప్రముఖులు లోకేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకురాలు రేఖ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి వేముల కొండల్ గౌడ్, లింగస్వామి గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సర్పంచులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

About The Author