రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి..
ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నిర్మల్ జిల్లా శుక్రవారం సారంగాపూర్ మండలం చించోలి.బి గ్రామంలోని డిసిఎంఎస్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఏర్పాటు చేసిన స్టాక్ బోర్డును పరిశీలించారు. తప్పకుండా ప్రతిరోజు రైతులకు ఎరువుల దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా ఇతర ఎరువుల వివరాలు అర్థమయ్యేలా స్పష్టంగా స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ఎరువులు అమ్మకానికి సంబంధించి రసీదులను తనిఖీ చేశారు. అన్ని రసీదులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ, గడువు తీరిన ఎరువులను విక్రయించవద్దని హెచ్చరించారు.
గ్రామానికి చెందిన పలువురు రైతులతో మాట్లాడుతూ, రైతులు సాగు చేస్తున్న పంటలు, వారికి అవసరమైన ఎరువుల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఫర్టిలైజర్ దుకాణాలలో అన్ని పంటలకు సరిపడిన మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని వారికి చెప్పారు. ఎరువుల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. పంటలకు అవసరమైన మోతాదులో మాత్రమే ఎరువులను వేయాలన్నారు. అధిక యూరియా వేయడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందనేది అపోహ మాత్రమే అని చెప్పారు. అధిక ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుందని వివరించారు.
అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణంలోని స్టాక్ బోర్డును పరిశీలించారు. యూరియా, డిఏపి అమ్మకాలకు సంబంధించిన రసీదులను పరిశీలించి, ప్రతి అమ్మకానికి సంబంధించిన రసీదును సంబంధిత రైతుకు కచ్చితంగా అందించాలని అన్నారు. పురుగుల మందు లేబుళ్లను పరిశీలించి, గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే పురుగుల మందులను మాత్రమే రైతులకు విక్రయించాలని అన్నారు. గడువు తీరిన, నకిలీ మందులను విక్రయించవద్దని అన్నారు. సంబంధిత అధికారులు అంతా ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను తనిఖీలు చేస్తూ ఉండాలని ఆదేశించారు.
ఈ తనిఖీలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.