సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు..
ఖమ్మం (భారత శక్తి ప్రతినిధి ) జూలై 31:సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంత్రి వర్యులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతం తరుణీ హాట్ వద్ద నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణ స్థలాన్ని మొత్తం పరిశీలించారు.సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణ డ్రాఫ్ట్ ప్లాన్ వివరాలను ఆర్ అండ్ బీ అధికారులు, జిల్లా కలెక్టర్ ల నుంచి మంత్రివర్యులు తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణ స్థలం పూర్తి స్థాయిలో చదును చేయాలని అన్నారు. ఈ స్థలంలో పాతబడిన, అనవసరమైన నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించాలని మంత్రి సూచించారు.మండల స్థాయిలో ప్రజల సౌకర్యార్థం అన్ని కార్యాలయాలు ఒకే చోట అన్ని వసతులతో ఉండే విధంగా నిర్మించాలని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు, డిజైన్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
మండల స్థాయిలో తహసిల్దార్, ఎంపిడిఓ, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ మొదలగు అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయం ఉండాలని అన్నారు. మండల కార్యాలయం నిర్మించిన తర్వాత నిర్వహణ కూడా సక్రమంగా జరిగేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి సూచించారు. అంతర్గంగా 30 ఫీట్ల రోడ్డు వేసేలా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఫైర్ సేప్టీ సూచనలు పాటిస్తూ నిర్మాణాలు జరగాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మండల కార్యాలయ సముదాయం అవసరమైన విద్యుత్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు సమకూర్చుకునేలా ప్లాన్ లో భాగస్వామ్యం చేయాలని అన్నారు. సమీకృత మండల కార్యాలయ సముదాయం వద్ద అవసరమైన పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా త్రాగు నీటి సరఫరా కనెక్షన్ తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫ్లోర్ లో ప్రజల వెయిటింగ్ ఏరియా ఉండాలని, అక్కడ త్రాగు నీటి ట్యాప్ ఉండాలని అన్నారు. కార్యాలయాల్లో ఫైల్స్ పెట్టెందుకు స్టోరేజ్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసిల్దార్ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.