ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి

రాజకీయాలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.. ఇదేనా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 
వారికేనా ఇందిరమ్మ ఇండ్లు అని ప్రశ్నించారు సిపిఎం పార్టీ మధిర డివిజన్ మడిపల్లి గోపాల్‌రావు

WhatsApp Image 2025-07-31 at 5.13.42 PMరాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్‌రావు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలకు ఉన్న చట్టబద్ధత ఏమిటని, వారు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని, భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కార్యక్రమాలను అడ్డుకుంటామని ఆయ‌న హెచ్చ‌రించారు. గురువారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారితో బోనకల్లు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి స్థానిక ప్రొఫెసర్ జయశంకర్ సెంటర్ మీదుగా తాసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. తాసీల్దార్ కార్యాలయం ముందు రెండు గంటల పాటు ధర్నా చేశారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గ్రామ సభల ద్వారా అధికారులే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్‌లో ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులా, ఇతర పార్టీలలో ఉంటే వారు అర్హులు కాదా అని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్‌కు చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల‌కు, వితంతువులకి, వికలాంగులకు, ఒంటరి మహిళలకు రాజకీయాల పేరుతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పెద్ద పెద్ద ఇల్లు ఉన్నవారికి, పొలాలు, ట్రాక్టర్లు, కార్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారని ఆయ‌న మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా తాసీల్దార్ మ‌ద్దెల ర‌మాదేవి స్పందిస్తూ.. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అర్హులైన వారందరికీ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. మంజూరైన వారిలో అర్హత లేకపోతే విచారణ చేసి తొలగిస్తామన్నారు. తాసీల్దార్ హామీతో ధర్నాను ముగించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కిలారి సురేశ్‌, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యుడు పాపినేని రామ నరసయ్య, సీనియర్ నాయకుడు చింతలచెరువు కోటేశ్వరరావు, తుళ్లూరు రమేశ్‌, బంధం శ్రీనివాసరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సునీత, గుడ్డూరి ఉమ, నల్లమోతు వాణి, నోముల వెంకట నరసమ్మ, పసుపులేటి నరేశ్‌, కందికొండ శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, దొండపాడు సత్యనారాయణ, బండి శ్రీనివాసరావు, గుమ్మ ముత్తారావు, గుగులోతు నరేశ్‌, కోట నాగరాజు, మర్రి తిరుపతిరావు, కొమ్ము కమలమ్మ, యేసుపోగు బాబు, వివిధ గ్రామాల నుంచి ప్రధానంగా తూటికుంట్ల గ్రామం నుంచి పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author