మూసీ నది గర్భంలో ఆక్రమణల తొలగింపు
20 మీటర్లకు పైగా మట్టితో నింపిన కబ్జాదారులు
20 మీటర్లకు పైగా మట్టితో నింపిన కబ్జాదారులు
కోర్టు ధిక్కరణ కేసులున్నా వెరవని వైనం
వాహనాల పార్కింగ్‌తో వ్యాపార దందా..
హైదరాబాద్ (భారత శక్తి )జులై 29:నగరం నడిబొడ్డున.. ఎంజీబీఎస్, హైకోర్టు ఒక వైపు.. మరో వైపు ఉస్మానియా ఆసుపత్రి.. ఇలా వేలాది మంది సంచరించే ప్రాంతంలో కబ్జాల పర్వం కొనసాగింది. మూసీ నది గర్భంలో... 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి రోడ్డుకు సమాంతరంగా చేసి ఆక్రమణలకు ఒడికట్టారు. ఆ ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభించి... మధ్యాహ్నం 1 గంటకు పూర్తి చేసింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి 9.62 ఎకరాల భూమిని కాపాడింది. వాహనాల పార్కింగ్, పండ్లను నిలవ ఉంచేందుకు ఫ్రీజర్ల ఏర్పాటుతో పాటు నర్సరీ పేరిట నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించింది. మూసీ ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది. షెడ్డులు వేసుకుని నివాసముంటున్న వారి విషయంలో ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడింది.
కోర్టు ధిక్కరణ కేసులున్నా కొనసాగిన కబ్జాలు
తికారం సింగ్ 3.10 ఎకరాల మేర కబ్జా చేశారు. 1.30 ఎకరాల మేర పూనమ్ చాంద్ యాదవ్ ఆక్రమించారు. 5.22 ఎకరాల మేర జయకృష్ణ కబ్జా చేశారు. వీరిపై కోర్టు దిక్కరణ కేసులు కూడా ఉన్నాయి. ఈ కబ్జాలపై హైకోర్టు గతంలోనే కన్నెర్రజేసింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని కూడా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నాటి హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు కూడా పెట్టారు. ఇలా కోర్టు ధిక్కరణతో పాటు పోలీసు కేసులకు వెరవకుండా కబ్జాల పర్వం కొనసాగించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రధానంగా వాడారు. పండ్లను నిలువ చేసేందుకు ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేశారు. నర్సరీని కొంతమేర పెంచి వ్యాపార దందా కొనసాగిస్తున్నారు. అక్కడ కార్యాలయాల నిమిత్తం చిన్న షెడ్డులు కూడా నిర్మించారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ. 300ల వరకూ వసూలు చేసి బస్సులు, లారీల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. నదీ గర్భంలోకి ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేయడమే కాకుండా.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
20 మీటర్ల మేర మట్టితో నింపి..
ఒకటి రెండు రోజుల్లో జరిగిన ఆక్రమణలు కావివి. మూసీ నదికి నిజాం కాలంలో రాతితో కట్టిన రిటైనింగ్ వాల్ స్పష్టంగా ఉంది. నదిలోంచి పైన రోడ్డుకు సమాంతరం చేసేందుకు వేలాది లారీలతో మట్టిని, నిర్మాణ వ్యర్థాలను పోశారు. ఇలా దశాబ్దాలుగా మూసీ నదిలో మట్టిని పోసి 20 మీటర్లకు పైగా నింపారు. అఫ్జల్‌గంజ్ రహదారికి సమాంతరంగా నదిని మార్చేశారు. వందల, వేలాది బస్సులు, లారీల పార్కింగ్‌కోసం వినియోగిస్తుంటే వాటిని ఖాళీ చేయించింది హైడ్రా. షెడ్డులు వేసుకుని వ్యాపారం చేస్తుంటే వాటిని తొలగించి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫొటోలు చూస్తే.. వాహనాల పార్కింగ్‌తో మూసీ ఎలా నిండి ఉంది.. తర్వాత ఎలా ఖాళీ అయ్యిందనేది స్పష్టమౌతుంది. మూసీ పరీవాహకం కబ్జాలను తొలగించిన హైడ్రాకు స్థానికులు అభినందనలు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మూసీ సుందరీకరణతో సంబంధం లేదు..
మూసీ సుందరీకరణ పనులతో హైడ్రాకు సంబంధం లేదు. నదిలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడం వరకే హైడ్రా పరమితమైంది. మూసీని మట్టితో నింపి వ్యాపారానికి అడ్డాగా మార్చుకోవడంపైనే హైడ్రా చర్యలు తీసుకుంది. మూసీ సుందరీకరణ.. అభివృద్ధిలో హైడ్రా భాగస్వామ్యం అవ్వడంలేదని స్పష్టం చేసింది. ఓఆర్ ఆర్ పరిధిలో నాలాలు, చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాలను తొలగించిన మాదిరే మూసీ నదిలో ఆక్రమణలను తొలగించింది హైడ్రా