రోహిత్ వేముల బిల్లు: కాంగ్రెస్ చేతిలో కమ్యూనిస్టుల కొడవలి

రోహిత్ వేముల బిల్లు: కాంగ్రెస్ చేతిలో కమ్యూనిస్టుల కొడవలి
భారత శక్తి ప్రత్యేక ప్రతినిధి, జూలై 30: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే వర్షాకాల శాసనసభ సమావేశాల్లో రోహిత్ వేముల పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. ‘‘ది కర్ణాటక రోహిత్ వేముల (ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్‌క్లూజన్ ఆర్ ఇన్‌జస్టిస్) (రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ) బిల్ 2025’’ అని పేరు పెట్టిన ప్రతిపాదిత బిల్లు నిజానికి సాంస్కృతిక మార్క్సిస్టుల వోకిజం సిద్ధాంతాల నోట్లో నుంచి ఊడిపడింది. సమాజాన్ని శాశ్వతంగా విభజించి, అంతు లేని ఘర్షణలతో నిరంతరం మండుతూ ఉండేలా చేయడమే ఆ బిల్లు లక్ష్యం. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షపై పోరాటం చేయడమే ఆ బిల్లు లక్ష్యం అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. కానీ వాస్తవానికి హిందూ మతంపై అణువణువునా ద్వేషాన్ని నింపుకుని ఆ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కనిపిస్తోంది.
 
కాంగ్రెస్ కుల రాజకీయం:
 
దేశంలో కుల గణన చేపట్టాలన్న రగడ, కులం ఆధారంగా సంపదను పునఃపంపిణీ చేయాలన్న వాదనల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరోసారి కుల రాజకీయాలు చేయడానికి రోహిత్ వేముల బిల్లు ద్వారా మరో దారి కనుగొంది.
 
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెద్దది కర్ణాటక మాత్రమే. అందుకే కుల రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాన్నే ఎంచుకుంది. అక్కడ సిద్దరామయ్య సర్కారు విద్యాసంస్థల్లో కులవివక్షను ఎదుర్కొనే పేరిట రోహిత్ వేముల బిల్లుకు రూపకల్పన చేసింది. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించింది.
 
రోహిత్ వేముల బిల్లులో ఏముంది?
 
— ఈ బిల్లు ముసాయిదా ప్రకారం దాని లక్ష్యం కర్ణాటకలోని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో అణగారిన వర్గాల విద్యార్ధులు అందరికీ చదువుకోడానికి సమానమైన అవకాశాలు కల్పిస్తారు. వారిపట్ల ఎలాంటి వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
 
— ఈ బిల్లు షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మైనారిటీ రిజర్వేషన్లకు చెందిన విద్యార్ధులకు అన్యాయం జరగకుండా, వారిని వదిలిపెట్టేయకుండా వారందరి విద్యా హక్కుకు, ఆత్మగౌరవానికీ ఎలాంటి అడ్డంకీ లేకుండా చూస్తుంది.
 
— ఈ బిల్లు ప్రకారం ప్రకటించిన నేరాలకు బెయిల్ రాదు, వాటికి కఠినమైన శిక్షలు తప్పనిసరి. అంటే ఈ కేసు కింద పోలీసులు నిందితులను వారంటు లేకుండానే అరెస్టు చేయగలరు. మొదటిసారి నేరం చేసిన వారికి కనీసం ఒక ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తారు. ఆ జరిమానా గరిష్ఠంగా రూ.లక్ష వరకూ విధించవచ్చు. అలా విధించే పరిహారం డబ్బును నిందితుడు బాధితుడికి చెల్లించాలి.  
 
— ఈ బిల్లు ప్రకారం నేరాలుగా గుర్తించే చర్యలను పదేపదే పునరావృతం చేసే వారికి మూడేళ్ళ జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
 
— ఈ బిల్లు చట్టం అయితే బాధితుడు లేక అతని బంధువులు ఎవరైనా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు, తద్వారా ఆరోపించబడిన వివక్షకు వ్యతిరేకంగా చర్యలు వేగంగా తీసుకోబడతాయి.
 
— అంతే కాదు, ఈ బిల్లులోని అంశాలను ఉల్లంఘించే విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం లేక గ్రాంటు తక్షణం ఆగిపోతుంది.
 
— ఈ తరహా కేసుల వేగవంతమైన విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు చెబుతోంది. దాని ప్రకారం, అలాంటి ప్రత్యేక కోర్టుల్లో ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రోసిక్యూటర్, హైకోర్టు బెంచిలో ఒక పబ్లిక్ ప్రోసిక్యూటర్‌ను నియమించాలి.
 
ఇది హిందూ వ్యతిరేక బిల్లు ఎలా అయింది?
 
ఈ బిల్లు సామాజిక న్యాయం సాధించే దిశలో ఓ ముందడుగు అని కాంగ్రెస్ పార్టీ, దాని సమర్ధకులు చెబుతున్నారు. అయితే బిల్లు ముసాయిదాను పరిశీలించి అధ్యయనం చేసిన విమర్శకులు చెబుతున్నది ఏంటంటే… ఈ బిల్లు అత్యంత విపరీత ధోరణిలో శిక్షలు విధించేలా ఉంది. ఈ బిల్లు హిందూ జనరల్ కేటగిరీ ప్రజలను లక్ష్యంగా చేసుకుంది. కర్ణాటక జనాభాలో జనరల్ కేటగిరీ హిందూ జనాభా 5శాతం కంటె తక్కువ. అలాంటి వారిని దురుద్దేశ పూర్వకంగా లక్ష్యం చేసుకుని శిక్షించడానికే ఈ బిల్లు ఉపయోగపడుతుంది.
 
రోహిత్ వేముల బిల్లు గురించి ప్రధానమైన ఆందోళనలు:  
 
1. జనరల్ కేటగిరీ హిందువులే నేరస్తులు అని ఈ బిల్లు ముందుగానే భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివక్షకు పాల్పడే దుండగులు అందరూ జనరల్ కేటగిరీ హిందువులే, ప్రత్యేకించి అగ్రవర్ణ హిందువులే అవుతారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు అందరూ బాధితులే. ఈ విధమైన కూర్పు నిజానికి అసలైన బాధితులను నిందితులుగా, అసలైన నిందితులను బాధితులుగా చిత్రిస్తుంది.
 
2. ఈ కేసు కింద నేరాలన్నీ నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ నేరాలే. అంటే ఈ నేరం మోపబడిన నిందితుల మీద కచ్చితంగా కేసు నమోదవుతుంది, వారికి బెయిల్ కూడా రాదు. ఈ బిల్లు ప్రకారం కులం ఆధారంగా వివక్ష చూపడం, అన్యాయం చేయడం వంటి నేరాలకు నిందితులను ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలూ లేకుండా, కనీసం వారంట్ అయినా లేకుండా అరెస్టు చేయవచ్చు. అందువల్ల సరైన ప్రక్రియ లేకపోడానికి, దుర్వినియోగం అవడానికీ ఆస్కారం ఎక్కువ. మరీ ముఖ్యంగా జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్ధులు, సిబ్బంది మీద తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఎక్కువ.
 
3. తప్పుడు ఆరోపణలను నివారించగల భద్రతా ఏర్పాట్లు ఏమీ లేవు. దురుద్దేశంతో లేదా తప్పుడుగా చేసే ఫిర్యాదుల మీద జరిమానా విధించడానికి ఎలాంటి ఏర్పాట్లూ లేవు. అందువల్ల ఈ బిల్లును విద్యాలయ ఆవరణల్లో కక్ష సాధింపులకు, వ్యక్తులను వేటాడడానికీ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.  
 
4. సంస్థాగతమైన ఒత్తిడి, మితిమీరిన రాజకీయ జోక్యం. నేరం జరిగింది అని నిరూపణ అయేలోగానే, కేవలం వివక్ష ఆరోపణల ఆధారంగా విద్యాసంస్థలకు ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసేలా ఈ బిల్లులోని అంశాలు భయపెడుతున్నాయి. దానివల్ల అధికార పక్షం తమ భావజాలానికి మద్దతుగా నిలవని ప్రైవేటు లేదా డీమ్డ్ యూనివర్సిటీలను రాజకీయంగా లక్ష్యం చేసుకుని వేధించే అవకాశాలు ఎక్కువ.
 
5. అసలు ఈ రోహిత్ వేముల బిల్లు గతంలో యుపిఎ హయాంలో తీసురావడానికి ప్రయత్నించిన మత హింస బిల్లుకు మరో రూపంగా కనిపిస్తోందని చాలామంది విమర్శకుల అభిప్రాయం. అప్పటి ఆ బిల్లు మెజారిటీ మతస్తులకు వ్యతిరేకంగా రూపకల్పన చేయబడిందన్న విమర్శలు ఉన్నాయి. అగ్రవర్ణ హిందువులను దుష్టులుగా చూపిస్తూ మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను సామూహికంగా సమీకరించేందుకు చేస్తున్న రాజకీయ ప్రయత్నమే ఈ బిల్లు అన్న వాదనా ఉంది.
 
ఈ కారణాల వల్ల ఈ బిల్లును హిందూ వ్యతిరేక బిల్లుగా పలువురు అనుమానిస్తున్నారు. ఈ బిల్లు గురించి పలువురు ఆందోళన చెందుతున్నారు.
IMG-20250725-WA0016
 
కాంగ్రెస్ చేతిలో కమ్యూనిస్టుల కొడవలి :
 
ఈ సమాజాన్ని ‘పీడకుడు’, ‘పీడితుడు’ అనే రెండు వర్గాలుగా విభజించడం… ఆ రెండింటి మధ్యా నిరంతరాయంగా ఘర్షణలను ప్రజ్వరిల్లజేస్తూ ఉండడం… అరాచకత్వానికి, హింసకు, విధ్వంసానికీ దారి తీయడమే… మార్క్సిజం మౌలిక సిద్ధాంతం. సంప్రదాయిక మార్క్సిజంలో ఈ విభజనకు ఆధారం ఆర్థికపరమైనది – ధనవంతులు పేదవారి మధ్య ఘర్షణ, లేదా, పెట్టుబడిదారులు శ్రామికుల మధ్య ఘర్షణ. అయితే పని చేసే తరగతి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతున్న కొద్దీ వారు కమ్యూనిజాన్ని పట్టించుకోవడం మానేసారు. ప్రజాస్వామిక, పెట్టుబడిదారీ దేశాల్లో సృష్టించబడుతున్న సమృద్ధిలో వారు సంతోషంగా భాగస్వాములు అవసాగారు.   
 
ఎప్పటికీ తుడిచివేయలేని, నిరంతర ఘర్షణకు ఎప్పటికీ అంతం ఉండని లోపాల అన్వేషణలో మార్క్సిస్టులు సమాజంలోని విభజనకు ప్రాతిపదికను ఆర్ధిక కారణాల నుంచి సాంస్కృతిక కారణాలకు బదలాయించారు. పెద్ద కులాలు చిన్న కులాల మధ్య ఘర్షణ, మగవారు ఆడవారి మధ్య ఘర్షణ, మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల మధ్య ఘర్షణ వంటి వాటికి బీజాలు చల్లారు. ‘పీడకులు’ అని ముద్ర వేయబడిన వర్గాల్లో తమదే తప్పేమో అనే అవమానంతో కూడిన భావన కలిగేలా చేసారు. అలాగే ‘పీడితులు’ అని ముద్ర పడిన వర్గాల్లో తాము బాధితులం అనే భావన కలిగేలా చేసారు. అలా మెల్లమెల్లగా ఈ సమాజాన్ని బలహీనపరిచి, ప్రతీ దానికీ ప్రభుత్వం మీద ఆధారపడేలా చేస్తే అదే కమ్యూనిజానికి ఆదర్శ పరిస్థితి.          
 
ఆర్థిక పరామితుల్లా కాకుండా, సాంస్కృతిక లోపాల నడుమ అణచివేత అనేది కనబడని విషయం. ‘పీడితులు’ ఎంత ఆర్థికంగా ప్రగతి సాధించినప్పటికీ, వాళ్ళు దళితులో లేక వెనుకబడిన తరగతికి చెందిన వారో కాబట్టి వాళ్ళమీద ఇంకా వివక్ష కొనసాగుతోందని వాళ్ళను నమ్మించడం సులువు. ఉదాహరణకు జనరల్ కేటగిరీకి చెందిన ఒక విద్యార్ధి ఒక దళిత విద్యార్ధికి పెన్ను కావలసి వచ్చినప్పుడు ఇవ్వడానికి నిరాకరిస్తే, అతను దళితుడు కాబట్టే అగ్ర వర్ణ విద్యార్ధి పెన్ను ఇవ్వలేదు అని అతన్ని సులువుగా నమ్మించవచ్చు. ‘అణచివేయబడిన’ వర్గాలకు చెందిన ఎవరి మీదనైనా స్నేహపూర్వకంగా అయినా సరే సరదాగా ఏదైనా వ్యాఖ్య చేస్తే అది ‘హింస’ అయిపోతుంది, అంత మాత్రమే కాదు, అది అత్యంత దారుణమైన నేరం కూడా అయిపోతుంది.
 
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన రోహిత్ వేముల బిల్లు వెనుక ఉన్న భయంకరమైన ‘వోక్’ ఆలోచనలు ఇవే. ఆ అమానుషమైన చట్టం ప్రకారం జనరల్ కేటగిరీకి చెందిన ఒక విద్యార్ధి… దళిత, ఓబీసీ లేక మైనారిటీ వర్గానికి చెందిన మరో విద్యార్ధి మీద అలాంటి ‘సూక్ష్మస్థాయి దాడి’కి పాల్పడితే అది కేసు పెట్టదగిన, బెయిల్ కూడా ఇవ్వకూడని నేరం అయిపోతుంది. దానికి ఆ విద్యార్ధికి ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. ఈ ప్రతిపాదిత చట్టంలో ఇంకా దారుణం ఏంటంటే తాను తప్పు చేయలేదు అని నిరూపించుకోవలసిన బాధ్యత కూడా నిందితుడి మీదే ఉంటుంది. అలాంటి విపరీత ధోరణి కలిగిన, నిస్సిగ్గుగా ఏకపక్షంగా రూపొందించిన చట్టం అమల్లోకి వస్తే దాన్ని వేధింపులు, బ్లాక్‌మెయిల్, వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి మితిమీరి దుర్వినియోగం చేస్తారు అలని చెప్పడానికి మహా మేధస్సు ఏమీ అక్కరలేదు. ఇందులో ‘మైనారిటీ’ అనే పదాన్ని చేర్చడానికి కారణం ముస్లిములను బుజ్జగించడానికే అన్నది సుస్పష్టం. భారతదేశంలో ముస్లిములను ‘పీడిత’ వర్గంగానూ హిందువులను ‘పీడక’ వర్గంగానూ వర్గీకరించడం అనేది అత్యంత క్రూరమైన విషయం

About The Author